శైవ క్షేత్రం శ్రీశైలంలో మొదలైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Srisailam Brahmotsavam : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.

Courtesy: x

Share:

శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు యాగశాలలో ఉత్సవాల ప్రారంభ పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నేటి నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రాత్రివేళల్లో స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు జరుగుతాయని ఆల‌య అర్చ‌కులు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని, ప్రధాన వీధులను విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేశారు. అలాగే బ్రహ్మోత్సవాలకు భక్తులకు స్వాగతం పలుకుతూ శ్రీశైలం ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు రహదారి మార్గంలో స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు.

13వ తేదీన భృంగివాహనసేవ, 14న రావణవాహనసేవ, 15వ తేదీ మకరసంక్రాంతి పర్వదినం రోజున నందివాహనసేవ, స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం, 16వ తేదీన కైలాసవాహనసేవ, 17 వతేదీన యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోణ కార్యక్రమాలు, 18 వ తేదీన రాత్రి జరిగే పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత హోమాలు నిలుపుదల చేసినట్టు పేర్కొన్నారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. నేటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు రుద్ర, చండీహోమం, కళ్యాణం, ఏకాంతసేవ నిలుపుదల చేస్తున్నట్టు ఈవో పెద్దిరాజు తెలిపారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ఆ స్థాయిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలివస్తారని ఈవో చెప్పుకొచ్చారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. దీంతో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు. డిసెంబర్‌ 13 నుంచి జనవరి 9 వరకు రూ.4,38,53,238 కోట్ల మేరకు ఆలయ హుండీ ఆదాయం సమకూరిందని తెలిపారు.