ఏపీలో వైఎస్సార్సీపీకి భారీ షాక్.. పార్టీకి ఎమ్మెల్సీ రాజీనామా!

Janasena : విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ పార్టీ మారారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ బుధవారం జనసేనలో చేరారు.

Courtesy: x

Share:

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆశావహులు, వైసీపీ సీనియర్ నేతలు ఇలా.. సీట్ల కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా, మరో వైసీపీ నేత పార్టీని వీడారు. విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ  వంశీకృష్ణ యాదవ్‌ పార్టీ మారారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ బుధవారం జనసేనలో చేరారు. వంశీకృష్ణకు కండువా కప్పి పవన్ కల్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. 

వచ్చే ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి చాలా కీలకమని పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వంశీకృష్ణ గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారని, అప్పటి నుంచి ఆయన తనకు తెలుసని తెలిపారు. తనను నమ్మి పార్టీలోకి వచ్చిన వారిని గుర్తుపెట్టుకుంటానని వెల్లడించారు. ప్రజా రాజ్యం యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి వంశీతో నాకు పరిచయం ఉందన్నారు. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీ జనసేనలోకి వచ్చిన ఆయనని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్నారు. వంశీ జనసేనలోకి రావడం ఆయన తన సొంతింటికి రావడమేనని పవన్ తెలిపారు. "ఆయన పార్టీలోకి వచ్చిన విధానం నాకు నచ్చింది.. వంశీ ఏ నమ్మకంతో జనసేనలోకి వచ్చారో.. ఆ నమ్మకం కొల్పోకుండా పార్టీ అండగా ఉంటుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. వంశీని నేనో నియోజకవర్గం దృష్టిలో నేను చూడడం లేదు.. వంశీ వంటి నేతలు రాష్ట్రానికి అవసరం.. వంశీకి చాలా బలంగా పార్టీ అండగా ఉంటుంది"అని  పవన్  హామీ ఇచ్చారు. 2014 ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ వెంట నడిచిన ప్రతిఒక్కరూ నేడు, జనసేన వైపుకు రావడం ఆనందంగా ఉందని పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ యాదవ్​ తో పాటుగా ఆయన అనుచరులు సైతం జనసేనలో చేరారు.

గతంలో మేయర్‌గా ఎన్నిక కాకపోవడంతో మనస్తాపానికి గురైన వంశీకృష్ణ, నగర పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కొంతమంది వైసీపీ నాయకులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన వైఎస్సార్‌సీపీ అధిష్టానం, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. కానీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్న ఆయన ఇప్పుడు జనసేనలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈయనను బుజ్జగించేందుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు వంశీని కలిసి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.