తెలంగాణలో ఒకే ఇంట్లో 5 మందికి Covid.. దేశంలోనూ పెరుగుతున్న యాక్టివ్ కేసులు!

Covid variant JN.1: తాజాగా దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా వైరస్ కేసులు 4,054కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలను అధికారిక వెబ్ సైట్లో వెల్లడించింది.

Courtesy: IDL

Share:

భారత్‌లో కరోనా వైరస్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా వైరస్ కేసులు 4,054కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలను అధికారిక వెబ్ సైట్లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అనగా.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 312 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇక తాజా కేసుల్లో అత్యధికంగా కేరళలో 128 కేసులు వెలుగుచూశాయి. నిన్న ఒక్క రోజే ఒక మరణం నమోదైంది. దీంతో మొత్తం కొవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,33కి చేరింది. ఇక 24 గంటల్లో 315 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 చేరుకుంది.

మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220,67,79,081 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని థానేలో తాజాగా 5 కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు నమోదయ్యాయి. నవంబర్‌ 30 నుంచి 20 నమూనాలను పరీక్షించగా థానే నగరంలో ఐదు జేఎన్‌.1 వేరియంట్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డానికి కొత్త వేరియంట్ జేఎన్‌.1 కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

తెలంగాణలో కూడా కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. కొత్తగా తెలంగాణలో మరో 12పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో మొత్తం 1,322 శాంపిళ్లను పరీక్షించగా, 12 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. మరో 30 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజా పాజిటివ్ కేసులతో కలిపితే కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,44,540కి పెరిగింది. ఇవాళ ఒకరు కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగుల రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. కేసుల పెరుగుదలతో కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. దీనికి తగినట్లుగానే తెలంగాణలోని పలు జిల్లాల్లోని ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

జయశంకర్‌ భూపాలపల్లి ఒకే ఇంట్లో 5 మందికి
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్‌ కలకలం రేపింది. గణపురం మండలం గాంధీనగర్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టు నిర్వహించగా నలుగురికి కోవిడ్  లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. వారిని ఇంట్లోనే ఐసోలేట్‌ చేశామని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్‌వో మధుసూదన్‌ తెలిపారు. జిల్లాలోని వంద పడకల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు.