రామ మందిర ప్రారంభానికి 11 రోజులే ఉంది.. ప్రధాని మోదీ భావోద్వేగ సందేశం!

Ayodhya : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. ఈ నెల 22న గర్భాలయంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది.

Courtesy: IDL

Share:

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. ఈ నెల 22న గర్భాలయంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమం కోసం యావత్‌ భారత దేశం ఎదురుచూస్తుండగా.. వేడుకకు వేర్పాట్లు చకాచక సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో రాముడి ప్రాణ ప్రతిష్టకు ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలుపుతూ భారత ప్రధాని కీలక సందేశాన్ని ఇచ్చారు. ఎక్స్ (ట్విటర్) ద్వారా ఆయన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ఓ సందేశాన్ని విడుదల చేశారు. 

‘అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్టకు మరో 11 రోజులు మాత్రమే ఉంది. మహోత్తర ఘట్టాన్ని ప్రారంభించే క్రతువులో భాగస్వామ్యం కావడం నా అదృష్టం. భగవంతుడు దేశ ప్రజల అందరి తరఫున  ప్రతినిధిగా నన్ను ఈ వేడుకలో భాగస్వామిని చేస్తున్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు నుంచి 11 రోజుల ప్రత్యేక పూజను ప్రారంభిస్తున్నాను. ఈ క్రతువులో నేను ప్రజలందరి ఆశీస్సులు కోరుతున్నాను. ఈ సమయంలో నా భావాలను మాటల్లో చెప్పడం చాలా కష్టం. నా జీవితంలో మొదటిసారిగా మాటల్లో వర్ణించలేని భావోద్వేగాలకు గురవుతున్నాను. నేను భిన్నమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నాను. నాకు, ఇది మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ సందర్భంగా నా భావాలు తెలపడం కష్టంగా ఉన్నా.. నా తరఫు నుంచి చేయగలిగిందతా చేస్తాను. మీరు కూడా నా పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటున్నారని భావిస్తున్నా." అని వెల్లడించారు. 

అయోధ్య నగరంలో ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ శాఖ భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నది. అయోధ్యలో కార్యక్రమం దేశానికి చాలా కీలకమైన రోజని.. ఇందుకోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పెషల్‌ డీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. సీసీటీవీల ద్వారా నిఘాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగే 22న, ఆ తర్వాత నుంచి రాముడి దర్శనానికి వచ్చే భక్తులందరికీ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అయోధ్యలో 10వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నగర భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. 

అయోధ్యకు 100 చార్టర్డ్ విమానాలు
 జనవరి 22న అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన వేడుకల కోసం 100 చార్టర్డ్ విమానాలు అయోధ్య విమానాశ్రయంలో దిగుతాయని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం తెలిపారు. ఇండిగో ద్వారా అయోధ్య నుండి అహ్మదాబాద్‌కు విమాన ప్రారంభోత్సవం కోసం జరిగిన వర్చువల్ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడారు. కార్యక్రమం అనంతరం సీఎం మాట్లాడారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 22న అయోధ్యలో కొత్తగా నిర్మించిన వాల్మీకి మహర్షి  అంతర్జాతీయ విమానాశ్రయంలో 100 చార్టర్డ్ విమానాలు ల్యాండ్ అవుతాయని తెలిపారు. ఫ్లైట్స్ ల్యాండింగ్ తో  ఎయిర్‌‌‌‌పోర్టు సామర్థ్యాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌కు నాల్గవ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం యోగి థ్యాంక్స్ చెప్పారు.