విమానంలో పైలట్ పై దాడి చేసిన ప్రయాణికుడు.. వీడియో వైరల్!

దిల్లీ విమానాశ్రయంలో దారుణం చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడు ఏకంగా పైలట్ పైనే దాడి చేయడం సంచలనం సృష్టించింది.

Courtesy: x

Share:

దిల్లీ: దిల్లీ విమానాశ్రయంలో దారుణం చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడు ఏకంగా పైలట్ పైనే దాడి చేయడం సంచలనం సృష్టించింది. విమానం ప్రయాణం ఆలస్యం కావడం గురించి పైలట్ ప్రకటన చేయగా.. ఇంతలో కోపంతో ఓ ప్రయాణికుడు అతడిపై దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం (6ఈ-2175)లో పొగమంచు కారణంగా కొన్ని గంటలు ఆలస్యమైంది. దీంతో ఓ ప్రయాణికుడు ఆలస్యం కావడం పట్ల ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఆలస్యం గురించి ప్రకటన చేస్తున్న పైలట్ పైకి దూసుకు వచ్చాడు. అంతలోనే పైలట్ పై దాడి చేశాడు. సదరు ప్రయాణికుడిని సాహిల్ కటరాయగా గుర్తించారు. ఇండిగో ప్రయాణికుడిపై భద్రతాధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అధికారికంగా కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉంది. వైరల్ వీడియో ద్రుశ్యాల ప్రకారం, పసుపు రంగు హుడీ ధరించి ఉన్న వ్యక్తి వెనక నుండి అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి పైలట్ మీద దాడి చేయడం గమనించవచ్చు. 

ఘటన జరిగిన వెంటనే ఆ ప్రయాణికుడిని విమానం నుంచి సిబ్బంది బయటకు తీసుకెళ్లి అధికారులకు అప్పగించారు. ట్విటర్ లో యూజర్లు వీడియోకు ప్రతిస్పందిస్తూ.. "ఆలస్యానికి పైలట్ లేదా క్యాబిన్ సిబ్బంది ఏమి చేస్తారు? వారు వారి విధిని మాత్రమే చేస్తున్నారు. ఈ వ్యక్తిని అరెస్టు చేసి, అతనిని నో-ఫ్లై లిస్ట్‌లో చేర్చండి. అతని చిత్రాన్ని బహిరంగంగా ప్రదర్శించాలి, తద్వారా అతని చెడు స్వభావాన్ని ప్రజలు తెలుసుకుంటారు" అని ఒక వ్యక్తి ట్విటర్ (X) లో రాశారు. "ఈ వ్యక్తిపై దాడి చేసినందుకు బుక్ చేయాలి అలాగే నో ఫ్లై లిస్ట్‌లో ఉంచాలి. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాని ప్రయాణీకుల ప్రవర్తన" అని మరో వ్యక్తి అభిప్రాయ పడ్డారు.

ఫ్లైట్ ట్రాకర్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం, దిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచుతో సహా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక విమానాలకు అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. ఈ రోజు 110 విమానాలు ఆలస్యంగా మరియు 79 విమానాలు రద్దు చేయబడ్డాయి. సగటున విమానాలు 50 నిమిషాలు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.