చంద్రయాన్ తో ప్రపంచ అగ్రగామిగా భారత్: ప్రధాని మోదీ

PM Modi: తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ రూ.20,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.

Courtesy: IDL

Share:

తిరుచిరాపల్లి: చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో మన శాస్త్రవేత్తలు భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటారని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అంతేకాకుండా, భారతీయ యువత తమ నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ రూ.20,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇందులో విమానయానం, రైలు, రోడ్డు, చమురు మరియు గ్యాస్, షిప్పింగ్ మరియు ఉన్నత విద్యా రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి. 

గత కొన్ని వారాలుగా తమిళనాడు ప్రజలు చాలా కష్టపడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. భారీ వర్షాల కారణంగా చాలా మందిని కోల్పోయామని.. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగిందని.. ఈ కష్టకాలంలో తమిళనాడు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.

‘‘యువత సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే నినాదంతో భారతీదాసన్‌ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రస్తుతం దేశ యువత అదే పనిలో నిమగ్నమై ఉంది. యువత అంటేనే శక్తికి నిదర్శనం. నైపుణ్యంతో వేగంగా పనిచేయడం వారికున్న సామర్థ్యం. దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు యువతకు ఇది మంచి సమయం. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా.. నైపుణ్యాలను పెంచుకుంటూ.. కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి’’ అని యువతకు మోదీ సూచించారు.

విమానాశ్రయం టెర్మినల్‌ను ప్రారంభించిన మోదీ
తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.1100 కోట్లకు పైగా వ్యయంతో రెండు స్థాయిల టెర్మినల్ భవనాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఏటా 44 లక్షల మంది ప్రయాణికులకు మరియు రద్దీ సమయాల్లో సుమారు 3,500 మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొత్త టెర్మినల్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు.

2014లో భారత్‌ నాలుగు వేల ఆవిష్కరణలకు పేటెంట్లు పొందితే.. ప్రస్తుతం ఆ సంఖ్య 50 వేలకు చేరిందని ప్రధాని తెలిపారు. చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో భారత శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని, మునుపెన్నడూ లేని విధంగా శాస్త్రవేత్తలు భారత ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్నారని ప్రశంసించారు. భారతీయ కళాకారులు, సంగీతకారులు ఎన్నో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారని తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ తిరుచ్చిరాపల్లిలో రూ.20,140 కోట్ల విలువైన  అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. గత పదేళ్లలో విమానాశ్రయాలు, జాతీయ రహదారుల సంఖ్యను రెండింతలు చేసినట్లు మోదీ తెలిపారు.