అయోధ్యలో మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభించిన మోదీ

Maharshi Valmiki International Airport: అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆధ్యాత్మిక నగరంలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Courtesy: IDL

Share:

అయోధ్య: అయోధ్య (Ayodhya) రామమందిర ప్రారంభోత్సవం కోసం యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శనివారం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆధ్యాత్మిక నగరంలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘అయోధ్య విమానాశ్రయానికి.. త్రికాలదర్శి అయిన మహర్షి వాల్మీకి పేరు పెట్టడం జన్మధన్యంగా భావిస్తున్నా. రోజుకు 10 లక్షల మందికి సేవలు అందించేలా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించాం. రద్దీ మేరకు రహదారులు విస్తరిస్తాం. అయోధ్యధామ్‌లో ఎక్కడ చూసినా రామనామం వినిపించాలి. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని వసతులతో టౌన్‌షిప్‌లు నిర్మిస్తున్నాం’’ అని వెల్లడించారు.

వచ్చే నెల జరగబోయే రామమందిర ప్రారంభోత్సవంపై ప్రధాని మాట్లాడారు. ‘‘2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. హిందుస్థాన్‌ చరిత్రలో జనవరి 22 విశిష్ఠమైన రోజుగా నిలుస్తుంది. ఆ రాత్రి దేశంలోని ప్రతి ఇంటా రామ జ్యోతి వెలిగించాలి. ఒకప్పుడు రామ్‌ లల్లా టెంట్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆయనకు పక్కా ఇంటిని అత్యంత సుందరంగా నిర్మించాం. ఆయనతో పాటు దేశంలో 4 కోట్ల మందికి మేం పక్కా గృహాలు కట్టించాం’’ అని మోదీ తెలిపారు.

ఈ సందర్భంగా భక్తులకు ప్రధాని కీలక సూచన చేశారు. ‘‘జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని అందరూ కోరుకుంటారు. కానీ, అది అందరికీ సాధ్యపడదని మీకు తెలుసు. అందుకే, రద్దీ దృష్ట్యా జనవరి 22న భక్తులు అయోధ్యకు రావొద్దు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 23 నుంచి జీవితాంతం శ్రీరాముడిని దర్శించుకోవచ్చు’’ అని మోదీ సూచించారు. భక్తులు ఇబ్బంది పడకూడదనే ఈ సూచన చేస్తున్నట్లు తెలిపారు.

అయోధ్యలో రోడ్ షోలో పాల్గొన్న మోదీ
ఈ ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ తొలుత 15 కిలోమీటర్ల మేర మెగా రోడ్‌ షోలో పాల్గొన్నారు.  ఇటీవ‌ల రీడెవ‌ల‌ప్ చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేష‌న్‌(Ayodhya Dham Railway Station)ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ ఉన్నారు. సుమారు 240 కోట్ల ఖ‌ర్చుతో అయోధ్య రైల్వే స్టేష‌న్‌ను రీడెవ‌ల‌ప్ చేశారు. మూడు అంత‌స్థుల్లో నిర్మించిన ఈ స్టేష‌న్‌లో అన్ని ఆధునిక సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేశారు. లిఫ్ట్‌లు, ఎస్క‌లేట‌ర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజా సామాగ్రి షాపులు, క్లోక్ రూమ్‌లు, చైల్డ్ కేర్ రూమ్‌లు, వెయిటింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేశారు. కొత్త‌గా నిర్మించిన అయోధ్య స్టేష‌న్‌కు ఐజీబీసీ గ్రీన్ స్టేష‌న్ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ఇక్కడే రెండు అమృత్‌ భారత్‌, ఆరు వందే భారత్‌ రైళ్లకు పచ్చ జెండా ఊపారు. అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. దీంతో పాటు రూ.15,700కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ కొత్త గా వ‌స్తున్న అమృత్ భార‌త్ రైలు ఎక్కారు. ఆ రైలులో ఉన్న విద్యార్థుల‌తో ఆయ‌న ముచ్చ‌టించారు. అమృత్ భార‌త్‌, వందేభార‌త్ రైళ్ల‌కు ప‌చ్చ‌జెండా ఊపి ప్రారంభించారు. రెండు అమృత్ భార‌త్‌, ఆరు వందేభార‌త్ రైళ్ల‌ను ఇవాళ స్టార్ట్ చేశారు.