నేడు ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ.. కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Courtesy: x

Share:

అనంతపురం: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటగా లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్నారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నాసిన్‌ (National Academy of Customs, Indirect Taxes and Narcotics)ను ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితమే ప్రధాని భద్రతా అధికారులు నాసిన్ కేంద్రాన్ని.. అదే విధంగా లేపాక్షి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య నాసిన్ ప్రారంభోత్సవం జరుగుతుందని అధికారులు తెలిపారు. మోదీ ఏపీ పర్యటన కోసం ప్రధాని కార్యాలయం ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం ప్రధాని పర్యటన షెడ్యూల్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటుగా, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పంపారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా మీడియాకు అనుమతి లేకుండా చేశారు. ఇప్పటికే నాసిన్ వెలుపల రాష్ట్ర పోలీసులతో భారీగా భత్రత ఏర్పాట్లు చేశారు. నాసిన్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి లేపాక్షికి హెలికాప్టర్​లో చేరుకోనున్నారు. ప్రఖ్యాత లేపాక్షి ఆలయాన్ని, శిల్పకళా సంపదను మధ్యాహ్నం 2 గంటలకు మోదీ సందర్శించనున్నారు. ఇందుకోసం లేపాక్షి ఆలయానికి సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆలయ సందర్శన అనంతరం హెలికాప్టర్ ​లో నాసిన్ ప్రాంగణంలోకి చేరుకోనున్నారు.

ఇక సీఎం జగన్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుంచి హెలికాప్టర్​లో మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా నాసిన్ ​కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్​లు హాజరుకానున్నారు. నాసిన్ ​లో సభావేదిక ఏర్పాటు చేశారు. ఐఆర్ఎస్, కస్టమ్స్ అధికారులకు నాసిన్ ​లో ప్రత్యేక శిక్షణ ఇవ్వటానికే ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.