6 గ్యారెంటీలకు దరఖాస్తు ఎక్కడ తీసుకోవాలి, ఎలా నింపాలి, ఎవరికి ఇవ్వాలి?

Praja Palana: తెలంగాణలో గురువారం నుంచి ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు లక్ష్యంగా ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇవాళ్టి(గురువారం) నుంచి జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

Courtesy: x

Share:

తెలంగాణలో గురువారం నుంచి ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు లక్ష్యంగా ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇవాళ్టి(గురువారం) నుంచి జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం సమాచారం దరఖాస్తుల ద్వారా తీసుకోనుంది. ‘ప్రజాపాలన దరఖాస్తు’ (Praja Palana) ఫారాన్ని బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ అప్లికేషన్‌లను బుధవారం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.

మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత.. అయిదు పథకాల వివరాలు ‘ప్రజాపాలన దరఖాస్తు’లో ఉన్నాయి. ప్రతి పథకానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు. అన్ని పథకాలకు ఒకే దరఖాస్తు ఇవ్వాలి. ఏ పథకానికి అర్హులైనవారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాలి. అన్ని పథకాలకూ అర్హులైనా.. ఒకే దరఖాస్తులోని ఆయా వివరాలు నింపితే సరిపోతుంది. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, దరఖాస్తుదారు ఫొటో ఇవ్వాలి.

తొలి పేజీలో కుటుంబ వివరాలు
తొలి పేజీలో కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌ సంఖ్య, రేషన్‌కార్డు సంఖ్య, మొబైల్‌ ఫోన్‌ నంబరు, వృత్తితో పాటు సామాజికవర్గం వివరాలను నింపాలి. ఇందులో దరఖాస్తుదారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు.. ఏ విభాగంలోకి వస్తే అక్కడ టిక్‌ పెట్టాలి. కింద కుటుంబసభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీలు, వారి ఆధార్‌ నంబర్లు పేర్కొనాలి. తర్వాత దరఖాస్తుదారు చిరునామా రాయాలి. ఆ తర్వాత అక్కడే ఐదు పథకాలకు సంబంధించిన వివరాలుంటాయి. ఏ పథకానికి దరఖాస్తు చేయాలని అనుకుంటే ఆ పథకం దగ్గర టిక్‌ చేయడంతో పాటు అందులో అడిగిన వివరాలు రాయాలి.

మహాలక్ష్మి:

మహాలక్ష్మి అనే పథకం కింద ప్రభుత్వం మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించనుంది. ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే అక్కడ బాక్సులో టిక్‌ పెట్టాలి. ఇదే పథకంలో భాగమైన రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ లబ్ధి పొందాలంటే, గ్యాస్‌ కనెక్షన్‌ సంఖ్య, సిలిండర్‌ సరఫరా చేస్తున్న గ్యాస్‌ కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు? అనే వివరాలు రాయాలి.

రైతుభరోసా:

ఈ పథకం రైతుల కోసం నిర్దేశించబడింది. దీని కింద లబ్ధి పొందాలనుకునే వ్యక్తి రైతా? కౌలు రైతా?.. అక్కడ టిక్‌ పెట్టాలి. పట్టాదారు పాసుపుస్తకం నంబర్లు. సాగు చేస్తున్న భూమి సర్వే నంబరు, సాగు విస్తీర్ణం లెక్కలు రాయాలి. దరఖాస్తుదారు వ్యవసాయ కూలీ అయితే.. ఉపాధి హామీ కార్డు నంబరు రాయాలి.

ఇందిరమ్మ ఇళ్లు:

ఈ పథకం ఇల్లు లేని వారికి సొంత ఇల్లు నిర్మించేందుకు నిర్దేశించబడింది. ఇల్లు లేని వారైతే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం బాక్సులో టిక్‌ చేయాలి. అమరవీరుల కుటుంబ సభ్యులు తమ పేరుతోపాటు.. అమరుడి పేరు, ఆయన మృతి చెందిన సంవత్సరం, ఎఫ్‌ఐఆర్‌, డెత్‌ సర్టిఫికెట్‌ నంబరు వివరాలు రాయాలి. తెలంగాణ ఉద్యమకారులైతే ఎదుర్కొన్న కేసుల ఎఫ్‌ఐఆర్‌, సంవత్సరం, జైలుకు వెళితే ఆ సంవత్సరం, జైలు పేరు, శిక్షా కాలం వివరాలు అందించాలి.

గృహజ్యోతి:

ఇది ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని పడకుండా నిర్దేశించిన పథకం. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం కింద.. దరఖాస్తుదారు నెలవారీ విద్యుత్తు వినియోగం వాడకం వివరాలు నింపాలి. ఇందులో 0-100 యూనిట్లు, 100-200 యూనిట్లు, 200 యూనిట్లపైన.. ఈ మూడింటిలో ఒక దాని ఎదురుగా టిక్‌ చేయాలి. గృహ వినియోగ విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ సంఖ్య రాయాలి.

చేయూత:

ఇప్పటికే పింఛను అందుకుంటున్నవారు ‘చేయూత’ పథకానికి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా పింఛను కోరుతున్నవారు మాత్రమే తమ వివరాలు ఇందులో రాయాలి. దివ్యాంగులైతే సంబంధిత బాక్సులో టిక్‌ చేసి సదరం సర్టిఫికెట్‌ సంఖ్య రాయాలి. ఇతరుల్లో.. వృద్ధాప్య, వితంతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్‌ బాధితులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, ఫైలేరియా బాధితులు, బీడీ టేకేదార్‌లలో.. ఎవరైతే వారికి సంబంధించిన బాక్సులో టిక్‌ చేయాలి.

చివరి పేజీలో దరఖాస్తుదారు సంతకం లేదా వేలిముద్రతో పాటు పేరు, తేదీ రాయాలి. నింపిన దరఖాస్తు ఫారాన్ని గ్రామసభ, వార్డు సభల్లో సమర్పించాలి. దరఖాస్తు ఆఖరిపేజీలో కింది భాగంలో ‘ప్రజాపాలన దరఖాస్తు రసీదు’ ఉంటుంది. దరఖాస్తుదారు పేరు, సంఖ్యతో పాటు దరఖాస్తు చేసిన పథకాల బాక్సులో టిక్‌ చేసి, సంబంధిత అధికారి సంతకం చేసి రసీదు ఇస్తారు.


దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి
ప్రజాపాలన దరఖాస్తులను విస్తృతంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు అధికారుల వద్ద ఉంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా గ్రామాల్లో పంచుతున్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ దరఖాస్తులో కుటుంబ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు జిరాక్స్‌, రేషన్‌ కార్డు జిరాక్స్‌ జతచేయాల్సి ఉంటుంది. పూర్తిగా నింపిన దరఖాస్తులను గ్రామసభల్లో లేదా వార్డు సభల్లో అధికారులకు ఇచ్చి రశీదు పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులన్నిటినీ స్క్రూటినీ చేసి ఎవరెవరు, ఏ పథకానికి అర్హులో తేలుస్తారు. ఆ లిస్ట్ ప్రకారం సహాయం అందిస్తారు.