భారీగా పెరుగుతున్న బియ్యం ధరలు, క్వింటాల్ పై సగటున రూ.1000 పెరుగుదల!

Rice price: దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. HMT, BPT, సోనామసూరి ధరలు క్వింటాల్‌పై రూ.1000 నుంచి రూ.1500 వరకు పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది.

Courtesy: IDL

Share:

దిల్లీ: దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. HMT, BPT, సోనామసూరి ధరలు క్వింటాల్‌పై రూ.1000 నుంచి రూ.1500 వరకు పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది. నిన్నమొన్నటి వరకు కిలో బియ్యం రూ.45 నుంచి రూ.50 మధ్య లభించగా ఇప్పుడా ధర ఏకంగా రూ.60కి పెరిగింది. కొంచెం మంచి రకాలైతే రూ.70 వరకు చెల్లించుకోవాల్సి వస్తున్నది. నిరుడు క్వింటాలు రూ.4,500 నుంచి రూ.5 వేల మధ్య లభించగా ఇప్పుడు ఏకంగా రూ.6,200 వరకు పెరిగింది. ఇందులో పాతబియ్యం అయితే రూ.7,500 వరకు పలుకుతున్నది. మొత్తంగా బియ్యం ధరలు సగటున రూ.1000 పెరిగాయి. కాగా, నిన్నమొన్నటి వరకు వంటనూనెలు, కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే ఇప్పుడా జాబితాలోకి బియ్యం వచ్చి చేరాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది.

పెరుగుదలకు కారణాలేంటి
బియ్యం ధరల పెరుగుదలకు ఆయా రాష్ట్రాల్లో వరిసాగు తగ్గడం కూడా ఒక కారణమని చెప్తున్నారు. నిజానికి ఈ వానకాలంలో దేశవ్యాప్తంగా వరిసాగు పెరిగినప్పటికీ కొన్ని రాష్ర్టాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులకు తోడు, మరికొన్ని రాష్ట్రాల్లో వరదల కారణంగా భారీగా పంటనష్టం సంభవించింది. ఇది అంతిమంగా బియ్యం ధరపై ప్రభావం చూపిస్తున్నది. దీనికితోడు సన్నాల సాగు కూడా గణనీయంగా పడిపోయింది. ప్రతి ఏటా వానకాలంలో మొత్తం సాగులో 50 శాతం సన్నాలు ఉండగా, ఈసారి మాత్రం 30 శాతానికే పరిమితమైంది. తెలంగాణలో ఈ వానకాలంలో రికార్డుస్థాయిలో 65 లక్షల ఎకరాల్లో వరిసాగైంది. ఈ లెక్కన దాదాపు 1.40 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి కావాల్సి ఉండగా పౌరసరఫరాల సంస్థ కొనుగోలులో ఇది 45 లక్షల టన్నులకే పరిమితమైంది. గతంలో ఎంతోకొంత సన్నాలు వచ్చేవి. ఈ సీజన్‌లో మాత్రం కేజీ బియ్యం కూడా కొనుగోలు కేంద్రాలకు రాలేదు. బియ్యం ధరలు అమాంతం పెరగడంతో సామాన్యుల బడ్జెట్‌కు చిల్లు పడుతున్నది.

మరింత పెరిగే అవకాశం
బియ్యానికి ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో సాధారణ రకం బియ్యం 25 కిలోల బస్తా మీద ధర రూ.180 నుంచి రూ.250 చొప్పున పెరిగింది. ఈ లెక్కన గతంలో రూ.1200 ఉన్న 25 కిలోల బస్తా ధర ప్రస్తుతం రూ.1,350 వరకు ఉంది. ఫైన్‌ క్వాలిటీ బియ్యమైతే రూ.1,650-1,800 మధ్య పలుకుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు ధరలు మరింత పెరగక తప్పని పరిస్థితి నెలకొంటుందని వ్యాపారులు చెప్తున్నారు.