Instagram Reel: ఇన్‌స్టా రీల్‌కు చెత్త కామెంట్లు.. ఆర్టిస్టు ఆత్మహత్య

4,000 ద్వేషపూరితమైన కామెంట్లు

Courtesy: Twitter

Share:

 Instagram Reel: సరదా పడి ఏదైనా చేస్తే సమర్ధించకపోగా విమర్శించే వారే ఎక్కువగా ఉంటారు. మంచో చెడో ఏదో ఒకటి అనందే మనసు ఊరుకోదు. కానీ పాపం అవతలి వాళ్లు ఎంత బాధ పడతారో అని ఒక్కసారి కూడా ఆలోచించరు. ఇష్టం లేకపోతే చూడ్డం మానేయాలి. అంతే కానీ మనసుని బాధపెట్టే మాటలంటే అందరూ తట్టుకోలేరు. ఇక్కడ కూడా ఓ 16 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ (Transgender) దీపావళి (Diwali) నాడు చీరకట్టుకుని రీల్ చేసి ఇన్ స్టాలో (Instagram Reel) పోస్ట్ చేశాడు. అది చూసి చాలా మంది విమర్శించారు. దాంతో అతడు కలత చెంది ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు.

సోషల్ మీడియా(Social Media) వచ్చాక సాధారణ ప్రజలు సైతం సెలబ్రిటీ ఇమేజ్ పొందుతున్నారు. ఒక్క వైరల్ వీడియోతో రాత్రి రాత్రికే స్టార్ అయిపోతున్నారు. ఇలా స్టార్ఇమేజ్ కోసం తహతహలాడుతూ సోషల్ మీడియాలో తమ లక్‌ను పరిక్షించుకుంటున్నారు. తమ టాలెంట్‌ను(Talent) బయట పెడుతూ ఎన్నో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో అదృష్టం వరించి కొందరు స్టార్స్ అయిపోతుంటే.. మరికొందరు నెగిటివ్ కామెంట్స్‌తో అబాసు పాలు అవుతున్నారు. దానివల్ల పలువురు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఓ టినేజ్ యువకుడు కూడా ఈ జాబితాలో చేరాడు.

సోషల్ మీడియాలో(Social Media) తన వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరించాలనుకున్న అతడికి చేదు అనుభవం ఎదురైంది. తన వీడియోకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూసి తట్టుకోలే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) చోటు చేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినికి చెందిన ప్రన్షు (16) ఓ ట్రాన్స్‌జెండర్ (Transgender). స్థానికంగా ఉన్న పబ్లిక్ స్కూల్‎లో చదువుతున్నాడు. అయితే ప్రన్షు(Pransu) యూట్యూబ్‎లో చూసి మేకప్ నేర్చుకున్నాడు. మేకప్ ఆర్టిస్టుగా ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా నడుపుతున్నాడు. దీంతో తరచూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల మేకప్ వీడియోలు షేర్ చేస్తూండేవాడు. అంతేకాదు రీల్స్(Reel) కూడా చేస్తూ తన హావభావాలను పండించేవాడు. ఈ క్రమంలో అతడికి నెటిజన్లు నుంచి మంచి ఆదరణ కూడా దక్కింది. ఇన్‌స్టాలో ఫాలోయింగ్ కూడా పెరిగిపోవడంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా(Social Media Influencer) మారాడు. అయితే ఇటీవల దీపావళి పండగ సందర్భంగా ప్రన్షు చీర కట్టుకుని మేకప్ వీడియో షేర్ చేశాడు.

అయితే ఆ వీడియోకు దాదాపు 4000 పైగా నెగిటివ్ కామెంట్స్(Negative comments) వచ్చాయి. అతడిపై అసభ్యకరమైన కామెంట్స్ రావడంతో ప్రన్షు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన అతడు శుక్రవారం రాత్రి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ విషయాన్ని మేడ్ ఇన్ హెవెన్ (Made in Heaven)వెబ్ సిరీస్ నటుడు, ట్రాన్స్‌జెండర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు(Transgender Trinetra Haldar Gummaraju) సోషల్ మీడియాలో వెల్లడించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ప్రన్షు(Pransu) ఫొటో షేర్ చేస్తూ.. ఇప్పుడు మీరంతా హ్యాపీ. కన్నీరు ఆగడం లేదు. తన వీడియోలకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ చూసి ప్రన్సు ఆత్మహత్య చేసుకున్నాడు. 16 ఏళ్ల ప్రన్షు మేకప్‌లో తమకు ఎన్నో మెళకువలు నేర్పాడు’ అంటూ పోస్ట్ షేర్ చేశాడు.

మెటా (Meta) యాజమాన్యంలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు LGBTQ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులకు సురక్షితమైన స్థలాన్ని అందించడంలో పదేపదే విఫలమయ్యాయని నటుడు త్రినేత్ర అన్నారు. LGBTQ కమ్యూనిటీకి చెందిన చాలా మంది సభ్యులు తమ బాధను వ్యక్తం చేశారు మరియు సైబర్ బెదిరింపును పరిష్కరించడానికి ఇన్‌స్టాగ్రామ్‌(Instagram), X మరియు ఫేస్ బుక్ (Facebook) వంటి ప్లాట్‌ఫారమ్‌లు సరిపోవని పేర్కొన్నారు. 2021లో సంస్థ నుండి వైదొలిగిన మాజీ మెటా ఎగ్జిక్యూటివ్ ఆర్థర్ బెజార్, ఇన్‌స్టాగ్రామ్ ప్రజలను "ప్రాథమికంగా తప్పుదోవ పట్టిస్తోందని" పేర్కొన్నారు.  బెజార్ ఈ నెల ప్రారంభంలో యూఎస్ సెనేటర్‌లో మాట్లాడుతూ.. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) సరికాదు అని చెప్పాడు.

అయితే, ప్రన్షు ఆత్మహత్య(Suicide) చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని స్థానిక పోలీసులు తెలిపారు. వీడియోకు వచ్చిన కామెంట్ల కారణంగానే ప్రన్షు మరణించాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.