రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతాం: ఉపముఖ్యమంత్రి భట్టి

Bhatti Vikramarka: తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ పాలనలో గత 10 సంవత్సరాల్లో ప్రజల సంపద దోపిడీకి గురైందని అన్నారు.

Courtesy: x

Share:

మధిర : తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ పాలనలో గత 10 సంవత్సరాల్లో ప్రజల సంపద దోపిడీకి గురైందని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా.. కాంగ్రెస్ ప్రభుత్వం  దోపిడీ చేయకుండా ప్రజల సంపదను ప్రజలకే పంచిపెడుతుందన్నారు.

గత ప్రభుత్వం పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. జనవరి 6వ తేదీ శనివారం ఖమ్మంలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో భట్టీ విక్రమార్క పాల్గొన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అమలు కాకుండా ఉంటే బాగుండు అని కొంత మంది బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారని.. కానీ, వారి ఆలోచనలు సాగవని ఎద్దేవా చేశారు. పూర్తిస్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 

బడ్జెట్‌ అంచనాల కోసమే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు.  ఎన్ని  అడ్డంకులు వచ్చినా.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని.. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని డిప్యూటీ సీఎం విక్రమార్క తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని..  ప్రభుత్వం ఏర్పడినా మొదటి గంటలోనే మహాలక్ష్మి కార్యక్రమం అమలుచేశామని చెప్పారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టకోలేదని మండిపడ్డారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి అర్హులైన ఏ ఒక్కరికీ కూడా ఇంటి స్థలం ఇవ్వలేదని.. కొత్త ఇళ్లను నిర్మించలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   

రాష్ట్రంలో సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతామని భట్టి తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవొద్దని..  ఇచ్చిన ప్రతిమాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని విమర్శించారు. భవిష్యత్తు ప్రణాళికలు తట్టుకోలేనంతగా రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని భట్టి గత ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల కలలు కలలుగానే మిగిలిపోయానన్నారు. గత ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదని.. అందుకే శ్వేత పత్రాలను విడుదల చేశామని చెప్పారు. అదేవిధంగా పేదలకు మెరుగైన వైద్యం అందాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు.