తెలంగాణలో 6 గ్యారెంటీల అమలుకు ఈ నెల 28 నుంచి దరఖాస్తులు

Telangana government: తెలంగాణ కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా ముందుకెళ్తోంది. 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28 నుంచి జనవరి 6వ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహించి, ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది.

Courtesy: x

Share:

హైదరాబాద్: తెలంగాణ కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా ముందుకెళ్తోంది. 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28 నుంచి జనవరి 6వ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహించి, ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి సచివాలయంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. 

సమావేశం ముగిసిన అనంతరం హౌసింగ్, సమాచార పౌర సంబంధాల మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడి సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తామని చెప్పారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకూ గ్రామ సభల ద్వారా ఆ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ పథకాలకు విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని, ప్రస్తుతానికి తెల్లరేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు వెల్లడించారు. రేషన్‌కార్డు ఉన్నవారి అర్హతల ఆధారంగా దరఖాస్తు తీసుకుంటామని చెప్పారు. కొత్త రేషన్‌ కార్డులకు, రైతుబంధుకు కూడా ఇక్కడే దరఖాస్తులు తీసుకోబోతున్నట్టు తెలిపారు. 'అర్హత ఉన్న వారు గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు అందజేయాలి. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన అనంతరం అధికారులు ఓ రశీదు ఇస్తారు. గూడెంలో 10 ఇళ్లు ఉన్నా అధికారులే స్వయంగా అక్కడికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు. స్వీకరణ ప్రక్రియ పూర్తైన అనంతరం వారు ఏ పథకానికి అర్హులో అధికారులే నిర్ణయిస్తారు.' అని వివరించారు. 

గత ప్రభుత్వంలో మాదిరి సంక్షేమ పథకాల్లో ఎవరికీ కోత విధించమని.. రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పదేళ్ల తర్వాత ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కోరుకున్నారని, ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతను కేబినెట్ లో తీసుకొచ్చినట్లు చెప్పారు. పథకాలకు సంబంధించి దరఖాస్తుకు సమయం తక్కువగా ఉన్నదని ఆందోళన చెందొద్దని ప్రజలకు మంత్రి పొంగులేటి సూచించారు. ‘ఇదే చివరి అవకాశం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. రద్దీ ఎక్కువగా ఉండి దరఖాస్తు చేసుకోలేనివారి నుంచి తర్వాత దరఖాస్తు తీసుకుంటాం. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి వారి అర్హతను బట్టి చిత్తశుద్ధితో దరఖాస్తు తీసుకుంటాం’ అని తెలిపారు.

ప్రజల వద్దకే అధికారులు వస్తారు
ప్రజా పాలనలో భాగంగా ప్రతి గ్రామం, వార్డు, డివిజన్‌, పట్టణాల్లో అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందుకోసం కొంతమంది అధికారులతో కలిపి బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ‘అధికారుల బృందం ప్రతిరోజు రెండు గ్రామాలను సందర్శిస్తుంది. గ్రామాలు, తండాలు, అనుబంధ గ్రామాల్లోకి కూడా వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారు. ఉద యం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక గ్రామం లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు మరో గ్రామంలో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు తీసుకుంటారు. దరఖాస్తులను రెండు రోజుల ముందే కలెక్టర్ల ద్వారా ఆయా గ్రామాలకు అందజేస్తారు. గ్రామాల్లో అర్హతను బట్టి ప్రజలకు దరఖాస్తు ఫారాలు అందజేస్తారు. 28వ తేదీ నుంచి వారి అర్హతకు అనుగుణంగా దరఖాస్తు స్వీకరించి రిసిప్ట్‌ కూడా అందజేస్తారు’ అని వివరించారు.

డ్రగ్స్‌ను అరికట్టడంపైనా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ పేరు వినిపించకుండా నిర్మూలించేలా కార్యాచరణ ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు చెప్పారు. ఇక అధికారులు, నేతలపై కక్షసాధింపు చర్యలు ఉండబోవని, అదే సమయంలో తప్పు చేస్తే ఎంత పెద్ద అధికారైనా, నేత అయినా చర్యలు తప్పవని హెచ్చరించినట్టు పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌ చెప్పినట్టుగా ధరణిలో మార్పు లు చేయనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గతంలో భూములు కబ్జా చేసి రెగ్యులరైజ్‌ చేయించుకున్నారని, ఇంకా కొన్ని ఫైల్స్‌ ప్రాసెస్‌లో ఉన్నాయని చె ప్పారు.