కొత్త రేషన్ కార్డుల కోసం వేచి ఉన్నారా.. 28 నుంచి దరఖాస్తులు ప్రారంభం!

Ration cards: ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోందని తెలుస్తోంది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Courtesy: IDL

Share:

హైదరాబాద్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోందని తెలుస్తోంది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హత కలిగిన లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు అవసరమైన విధివిధానాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు సమాచారం. 

అర్హుల ఎంపిక ప్రక్రియను గ్రామాల్లో గ్రామసభలు, నగరాలు, పట్టణాల్లో బస్తీసభల ద్వారా చేపట్టాలని భావిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించనున్నట్లు తెలుస్తోంది. అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలవుతుంది. 

రేషన్ కార్డుల్లో మార్పులకు కూడా అవకాశం!
రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా ఈనెల 28వ తేదీ నుంచి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులకు సంబంధించి ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు చేర్చేందుకు 11.02 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కొత్త కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో సవరణలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.  గతంలో ప్రభుత్వం ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు కదలలేదు.

కేవలం బియ్యం, నిత్యవసర సరుకుల కోసమే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల లబ్ది పొందడానికి కూడా రేషన్ కార్డు అవసరమే. ఆరోగ్యశ్రీ వంటి పలు పథకాల కోసం కూడా రేషన్‌ కార్డు ఉండాలన్న నిబంధన ఉంది. అర్హత కలిగినప్పటికీ అనేక కుటుంబాలు రేషన్‌ కార్డుల్లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందలేకపోతున్నాయి. కాబట్టి లక్షలాది కుటుంబాలు ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల కోసం వేచి ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికీ 6 కిలోల చొప్పున బియ్యం అందుతున్నాయి. గతంలో కిలో బియ్యం రూపాయికే ఇవ్వగా, కొవిడ్‌ ప్రభావం నేపథ్యంలో మూడేళ్లుగా ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు. కాగా, రేషన్‌ కార్డుల జారీకి అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉంది. 

ప్రస్తుతం ఎన్ని కార్డులు ఉన్నాయంటే?
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 89.98 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహారభద్రత చట్టం (NFSA) కింద జారీ చేసిన కార్డులు  54.39 లక్షలు ఉండగా, రాష్ట్ర ఆహారభద్రత కార్డులు 35.59 లక్షలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు 6,47,297 రేషన్‌కార్డులు జారీచేసినట్లు పౌరసరఫరాలశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటికింద 20,69,033 మంది లబ్ధిదారులున్నారు.