వాహనదారులకు రేవంత్ సర్కారు బంపరాఫర్.. చలానాలపై భారీ డిస్కౌంట్

Discounts on Traffic Challans: వాహనాలపై ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న చలాన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టూవీలర్స్‌పై 80 శాతం, ఫోర్‌ వీలర్స్‌, ఆటోలపై 60 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది.

Courtesy: IDL

Share:

హైదరాబాద్‌: తెలంగాణలో వాహనదారులకు రేవంత్ సర్కారు తీపి కబురు చెప్పింది. వాహనాలపై ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న చలాన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టూవీలర్స్‌పై 80 శాతం, ఫోర్‌ వీలర్స్‌, ఆటోలపై 60 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. లారీలతో పాటు ఇతర భారీ వాహనాలపై పెండింగ్‌ చలానాలో 50 శాతం తగ్గింపు ఇచ్చింది. డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్‌ చలానాల చెల్లింపుకు అవకాశం కల్పించారు. గతేడాది కూడా పెండింగ్ చలానాలపై రాయితీ ఇవ్వగా మంచి స్పందన వచ్చి రూ.300 కోట్ల వరకు చలానాలు వసూలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా మరోసారి చలాన్లపై డిస్కౌండ్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈసారి గతంలో ఇచ్చిన రాయితీ కన్నా ఎక్కువగా డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. 50 నుంచి 90 శాతం వరకు ఆయా వాహనాలపై రాయితీ ఇస్తూ పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకుని అద్బుత అవకాశాన్ని కల్పించింది. 

గతేడాది అనగా 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకూ వసూలయ్యాయి. దాదాపు 65 శాతం చలానాలు చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ పెండింగ్‌ భారం పెరిగిపోతోంది. గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ రెండు కోట్లకు చేరుకుందని అంచనా. ఈ నేపథ్యంలో మరోమారు రాయితీ ప్రకటించారు. పోలీసు శాఖ నిర్దేశించిన వ్యవధిలో చలానాలు చెల్లించేవారికే ఈ రాయితీ వర్తిస్తుంది. పెండింగ్ చలానాలపై భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించటంతో వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్లియర్ చేసుకోవాలని పోలీసులు చెప్తున్నారు.

మరోవైపు, నేడు హైదరాబాద్‌ కమిషనరేట్‌లో నగర నేర వార్షిక నివేదికను విడుదల చేసిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 

హైదరాబాద్‌లో నేరాల శాతం కొద్దిగా పెరిగిందని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్‌ రేటు 2 శాతం మేర పెరిగిందని సీపీ  శ్రీనివాస్‌రెడ్డి  తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో నగర నేర వార్షిక నివేదికను ఆయన శుక్రవారం విడుదల చేశారు. ఈ ఏడాదిలో హత్యలు తగ్గి, స్థిరాస్తి సంబంధిత నేరాలు 3 శాతం మేర పెరిగాయన్నారు. ఈ ఏడాది కాలంలో నగరంలో లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్ స్టేషన్ల కన్నా ట్రాఫిక్‌ పీఎస్‌లు పెరిగాయన్నారు.  నగరంలో ప్రస్తుతం 31 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.


‘‘చాలా కాలం తర్వాత ఈ ఏడాది గణేశ్‌ నిమజ్జనోత్సవం, మిలాద్‌ ఉన్‌ నబీ ఒకేసారి రావడంతో మత పెద్దల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించాం. అసెంబ్లీ ఎన్నికలు సహా ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించాం. ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయి.  గతేడాది సైబర్‌ నేరాల్లో రూ.82 కోట్ల మోసాలు జరిగితే, ఈసారి రూ.133 కోట్లను కేటుగాళ్లు కాజేశారు. ఆర్థిక నేరాలపై 2022లో 292 కేసులు నమోదైతే.. 2023లో స్పల్పం (344)గా పెరిగాయి. డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కోటిక్‌ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం. డ్రగ్స్‌ను గుర్తించేందుకు స్నైపర్‌ డాగ్స్‌ను వినియోగిస్తాం. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నాం’’ అని సీపీ వెల్లడించారు.