విషమంగా తమ్మినేని ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ లో వెల్లడించిన వైద్యులు

Thammineni Veerabhadram: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం పరిస్థితి క్రిటికల్ గా ఉందని హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

Courtesy: IDL

Share:

హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం పరిస్థితి క్రిటికల్ గా ఉందని హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామీణ మండలం తెల్దారుపల్లిలోని తన స్వగృహంలో ఉన్న తమ్మినేనికి ఉదయం ఛాతీ నొప్పితోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. 

గచ్చిబౌలి ఏఐజీలో ఇంటెన్సివ్ కేర్ లో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. మెడిసిన్స్ సాయంతో క్రిటికల్ కేర్ లో ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు. తమ్మినేనికి ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కారణంగా శాస్వ తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని ఖమ్మం డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది ఏఐజీ ఆసుపత్రి డాక్టర్లు. అక్కడ వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ప్రకటించారు. గుండె కొట్టుకోవడంలో అసాధారణ పరిస్థితితోపాటు కిడ్నీ సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. 

ఊపిరితిత్తుల్లో కూడా నీరు చేరిందన్నారు. తమ్మినేనిని ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని.. రక్తపోటు మెరుగుపరచడంతో పాటు ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించేందుకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఏఐజీకి చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ సోమరాజు, డాక్టర్‌ డీఎన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో క్రిటికల్‌ కేర్‌ నిపుణులు, కార్డియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలసిస్టులు, నెఫ్రాలజిస్టులు, ఛాతీవైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 24 గంటలు గడిస్తే కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అంచనా వేయలేము అన్నారు. ఇక, గతంలోనే తమ్మినేనికి స్ట్రోక్‌ రావడంతో స్టంట్‌ కూడా పడింది. 

హరీశ్ రావు పరామర్శ
చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రం కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, శాసనసభ్యులు హరీశ్‌రావుతోపాటు పలువురు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడిన హరీశ్‌రావు.. వీరభద్రం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, నరసింహారావు, పి.ప్రభాకర్‌ ఎప్పటికప్పుడు వివరాలు వాకబు చేస్తున్నారు.