ఈ సంక్రాంతి ఎంతో స్పెషల్.. రాజ్ భవన్ లో వేడుకల్లో పాల్గొన్న గవర్నర్

Governor Tamilisai: హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో శనివారం భోగి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో శనివారం భోగి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కుండ‌లో పాయ‌సం వండారు. దేశ‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై  భోగి, సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఇది ఎంతో ప్ర‌త్యేక‌మైన సంక్రాంతి పండగ అని పేర్కొన్నారు. ఎందుకంటే దేశ ప్రజల చిర‌కాల స్వ‌ప్నం అయిన రామ మందిర నిర్మాణం ఈ ఏడాది పూర్తి అయిన‌ట్లు చెప్పారు. 

శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాష‌లో ఓ పాట‌ను రిలీజ్ చేయ‌నున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వ‌ర్ధిల్లాల‌ని, ప్ర‌తి ఒక్క‌రూ సంతోషంగా ఉండాల‌ని ఆమె ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఇది విక‌సిత భార‌త్ అని ఆమె పేర్కొన్నారు. కాగా, గ‌వ‌ర్న‌ర్ తమిళిసై శుక్ర‌వారం పుదుచ్చేరిలోని రాజ్‌నివాస్‌లో ఇప్పటికే సంక్రాంతి వేడుక‌ల్ని నిర్వ‌హించారు. కాగా, ఈ రోజు సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. 

దిల్లీ పర్యటనపై క్లారిటీ ఇచ్చిన గవర్నర్
సంక్రాంతి సందర్భంగా వేడుకల కోసమే దిల్లీ వెళ్తున్నానని, ఇది రాజకీయ పర్యటన కాదని గవర్నర్ తమిళిసై ఇప్పటికే తెలిపారు. ‘‘సంక్రాంతి పండగను అందరూ సంతోషంగా చేసుకోవాలి. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ ఈ ఏడాది ప్రత్యేకత. రామ్‌మందిర్‌ పాటను తెలుగు, హిందీలో విడుదల చేస్తున్నాం’’ అని గవర్నర్‌ తెలిపారు. రేపు ప్రధానమంత్రి మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో సమావేశం కానున్నారు. 

ఇటీవల టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ రాజీనామా ఆమోదించిన గవర్నర్
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే. వారి రాజీనామాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనంతరం న్యాయ సలహా తీసుకొని, చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలో కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది. చైర్మన్, సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని రేవంత్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మున్ముందు ఎవరూ ఆటలాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగుచూడటంతో జనార్దన్ రెడ్డి ఆ సమయంలోనే రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామాను అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించింది.