ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. పీసీసీ చీఫ్ గా షర్మిల నియమకం

YS Sharmila Appointed as AP PCC : గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల‌ను నియమించింది.

Courtesy: x

Share:

విజయవాడ: గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల‌ను నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ (Congress) అధిష్ఠానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ (KC Venugopal) ప్రకటన విడుదల చేశారు.

తనను ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా నియామకం చేయడంపై వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా స్పందించారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవి అవకాశం కల్పించినందుకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కొరకు శ్రమిస్తానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం గిడుగు రుద్రరాజు తన సహకారాన్ని కొనసాగించాలని కోరారు.

సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC ) ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏపీకి చెందిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది. ఈమేరకు గురువారం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. 2022 నవంబర్‌ చివరి వారంలో ఏపీ పీసీసీగా నియామకమైన గిడుగు రుద్రరాజు సంవత్సరన్నరపాటు అధ్యక్షుడిగా సేవలందించారు. అంతకు ముందు ఏఐసీసీ కార్యద‌ర్శిగా ఒడిశా రాష్ట్ర స‌హాయ ఇన్‌చార్జి బాధ్యత‌లు నిర్వహించిన ఆయన గ‌తంలో ఎమ్మెల్సీగా ప‌నిచేయ‌డంతో పాటు వైఎస్సార్‌, కెవీపీలకు స‌న్నిహితుడిగా మెలిగారు. పార్టీ ఆదేశాల మేరకు సోమవారం ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన 24 గంటల్లోనే ఆ స్థానంలో వైఎస్‌ షర్మిలను పీసీసీ చీఫ్‌గా నియమించారు.

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ స్థాపకురాలు వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్‌ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌ అని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలను న్యాయం చేసే పార్టీ అని వెల్లడించారు.