కొత్త సంవత్సరం వేళ గూగుల్ లో లే ఆఫ్స్..!

Google: ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగులకు షాకిచ్చింది. తాజాగా ఈ కంపెనీ మరోసారి ఉద్యోగాల లేఆఫ్స్ వేసినట్లు సమాచారం.

Courtesy: Top Indian News

Share:

ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగులకు షాకిచ్చింది. తాజాగా ఈ కంపెనీ మరోసారి ఉద్యోగాల లేఆఫ్స్ వేసినట్లు సమాచారం. దాదాపుగా వెయ్యి మంది ఉద్యోగులను విధుల నుంచి తొల‌గించిన‌ట్టు తెలుస్తోంది. గూగుల్ హార్డ్‌వేర్‌, సెంట్ర‌ల్ ఇంజనీరింగ్ టీమ్‌లు, గూగుల్ అసిస్టెంట్ స‌హా ప‌లు విభాగాల్లో ఉద్యోగుల తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. ఈ లేఆఫ్స్ గురించి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌లేక‌పోయినందుకు చింతిస్తున్నామ‌ని చెప్పింది. వ్యాపార అవసరాలలో మార్పుల కారణంగా ఈ సంక్లిష్ట నిర్ణ‌యం తీసుకోవాల్సివ‌చ్చింద‌ని బాధిత ఉద్యోగుల‌కు పంపిన ఈమెయిల్‌లో ద్వారా పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.  తొలిగింపు సమయంలో అదనపు చెల్లింపులు చేయనున్నట్లు గూగుల్ స్ప‌ష్టం చేసింది. 

కొలువు కోల్పోయే ఉద్యోగులు కంపెనీలోని ఇతర విభాగాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్సిస్తామని తెలిపింది. కంపెనీలో తిరిగి అవ‌కాశం ద‌క్కని ఉద్యోగులు 2024 ఏప్రిల్‌లో కంపెనీని వీడాల‌ని తెలిపింది. చివరిగా 2023 జనవరిలో గూగుల్ 12 వేల మంది వరకు ఉద్యోగుల్ని తొలగించింది. 

గూగుల్‌లోని కెవిన్ బౌర్రిలియన్ అనే సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ట్విటర్ లో తన అనుభవాన్ని పంచుకున్నారు. Googleలో 19 సంవత్సరాల తర్వాత, అతను ఏర్పాటు చేసిన టీంలోని 16 మందితో సహా, తొలగించబడిన వారిలో తానూ ఉన్నానని పేర్కొన్నాడు. సవాళ్లు ఉన్నప్పటికీ, బోర్రిలియన్ సానుకూల దృక్పధాన్ని వ్యక్తం చేశాడు. ఉద్యోగం కోల్పోవడంపై స్పందిస్తూ.. విశ్రాంతి తీసుకోవడానికి, కుటుంబంతో సమయం గడపడానికి మరియు వ్యక్తిగత ప్రయోజనాలను కొనసాగించడానికి ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. 

ఇక 2023లోనే భారీగా ఉద్వాసనలు పలికిన టెక్ సంస్థలు.. ఈ సంవత్సరంలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నాయి. ఈ నెల 15 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 48 టెక్ కంపెనీలు 7,528 మంది నిపుణులను ఇంటికి సాగనంపాయని లే-ఆఫ్ ట్రాకింగ్ వెబ్ సైట్ లే-ఆప్స్.ఎఫ్‌వైఐ ప్రకటించింది. ఈ ఉద్వాసనలు 2024లోనూ కఠిన నిర్ణయాలకు దారి తీస్తాయన్న సంకేతాలు వస్తున్నాయి. 2023లో 1150కి పైగా టెక్ కంపెనీలు 2.60 లక్షల మందికి పైగా ఉద్యోగులపై లేఆఫ్ విధించాయి. 

గత వారమే అమెజాన్ లో కూడా
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల లే ఆఫ్స్ కు దిగిన విషయం తెలిసిందే. గత సంవత్సరం నుంచి ఈ కంపెనీ వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించినప్పటికీ..  తాజాగా మరోసారి ఈ కంపెనీ స్ట్రీమింగ్, స్టూడియో కార్యకలాపాలు (ప్రైమ్ వీడియో మరియు MGM స్టూడియోస్ విభాగాల) నుండి వందలాది ఉద్యోగులపై లే ఆఫ్స్ విధించింది. ఈ మేరకు ప్రైమ్ వీడియో, అమెజాన్ MGM స్టూడియోస్ విభాగం గత బుధవారం ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమో ద్వారా తెలిపినట్లు సమాచారం. ఏడాది ప్రారంభంలోనే వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది.