ఆదిత్య ఎల్‌-1 సక్సెస్: ఇక సూర్యుడిపై పరిశోధనలే తరువాయి.. రికార్డు సృష్టించిన ఇస్రో

Aditya L-1 Mission: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించింది. సూర్యునిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1 మిషన్ విజయవంతం అయింది.

Courtesy: Top Indian News

Share:

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించింది. సూర్యునిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1 మిషన్ విజయవంతం అయింది. ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను ఇస్రో శనివారం విజయవంతంగా హాలో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. సూర్యునిపై అధ్యయనం కోసం ఆదిత్య ఎల్‌-1 ను ఇస్రో శాస్త్రవేత్తలు సెప్టెంబర్ 2న ప్రయోగించారు. 127 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్ 1 వ్యోమనౌక గమ్యస్థానం చేరుకుంది. 1.5 మిలియన్ లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన వ్యోమనౌక లెగ్రాంజ్ 1 స్థానానికి చేరుకుంది. ఐదేళ్ల పాటు ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహం సేవలందించనుంది. శనివారం 4 గంటల సమయంలో ఇస్రో మరోసారి థ్రస్టర్లను మండించి హాలో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది.  ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. 

ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రధాని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘‘భారత్‌ మరో అరుదైన ఘనత సాధించింది. దేశ తొలి సోలార్‌ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్‌1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అద్భుత విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్రసాంకేతిక రంగంలో కొత్త శిఖరాలకు చేరుకునే మన ప్రయాణం కొనసాగుతుంది’’ అని మోదీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్‌ కూడా దీనిపై పోస్ట్‌ చేశారు. ‘‘మూన్‌ వాక్‌ నుంచి సన్‌ డ్యాన్స్‌ వరకు. ఆదిత్య-ఎల్‌1 తుది కక్ష్యలోకి చేరుకుంది. ఇస్రోకు అభినందనలు’’ అని ఆయన పోస్ట్‌లో వెల్లడించారు.

భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడికి భూమికి కేంద్రంగా ఉన్న మొదటి లాగ్రాంజియన్ పాయింట్ (L1) చుట్టూ ఉన్న హాలో కక్ష్య నుంచి ఈ ఉపగ్రహం సూర్యుడిపై పరిశోధనలు జరుపుతుంది. లాగ్రాంజ్ పాయింట్ భూమి-సూర్యుని మధ్య గురుత్వాకర్షణ సమానంగా ఉంటుంది.