అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి

Vivek Ramaswamy : రాబోయే యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలవాలనుకున్న భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వివేక్ రామస్వామి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.

Courtesy: Top Indian News

Share:

రాబోయే యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలవాలనుకున్న భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వివేక్ రామస్వామి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 2024 ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వానికి తొలి పోరు అయిన అయోవా కాకస్‌లో ఎదురుదెబ్బ తగలడంతో ఆయన తన ప్రచారాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

భారత సంతతికి చెందిన 39 ఏళ్ల ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి యూఎస్ ఎన్నికల బరిలో నిలిచేందుకు రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిగా ప్రయత్నాలు చేశారు. కానీ, తాజాగా జరిగిన అయోవా కాకసస్ పోటీలో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. ఊహించిన స్థాయిలో ఆయనకు ఓట్లు రాలేదు. దీనిలో ట్రంప్‌(52 శాతం ఓటింగ్‌) తొలి విజయం సాధించగా.. వివేక్(Vivek Ramaswamy) పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆయనకు కేవలం 7.7  శాతం ఓటింగే వచ్చింది. ప్రజలంతా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. 2024 అమెరికా అధ్యక్ష రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఐఓవా కాకస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రామస్వామి ఫ్రాడ్ అని ట్రంప్ ప్రచారం చేయడం గమనార్హం.

 ‘మేం ఆశించిన ఫలితాలను సాధించలేపోయామని భావిస్తున్నాను. మా ప్రచారాన్ని నిలిపివేస్తున్నాం. తదుపరి అధ్యక్షుడిగా ఉండేందుకు నాకు మార్గం లేదు. నేను రాత్రి డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసి అతని విజయానికి అభినందనలు తెలిపాను. అధ్యక్ష పదవికి అతనికి నా పూర్తి మద్దతు ఉంటుంది.’ అని ఈ ఫలితాల అనంతరం తన మద్దతుదారులతో మాట్లాడుతూ వివేక్ ప్రకటించారు. 

2023 ఫిబ్రవరిలో అధ్యక్ష రేసులోకి వచ్చిన సమయంలో రాజకీయంగా వివేక్‌ పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. మొదటి నుంచి ట్రంప్‌ విధానాలకే మద్దతు ఇస్తున్న ఆయన.. ప్రచారంలో కూడా మాజీ అధ్యక్షుడి శైలినే అనుకరించారు.రామస్వామి గతంలో ట్రంప్‌ను ‘21వ శతాబ్దపు ఉత్తమ అధ్యక్షుడు’ అని కొనియాడిన విషయం తెలిసిందే.  

ట్రంప్ ఘన విజయం
అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని ఉవ్విల్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్‌ కు తొలి విజయం దక్కింది. రిపబ్లికన్‌ పార్టీ తరపున అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటి భాగమైన ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. అయోవాలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ట్రంప్ మెజారిటీ ఓట్లను సాధించాడు. నిక్కీ హైలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌లను వెనక్కి నెట్టి ట్రంప్ ముందు వరుసకు దూసుకుపోయాడు. 1600 పోలింగ్ కేంద్రాల్లో జనం ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. అయోవాలో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ట్రంప్‌కు ఈ ఫలితం శుభసూచకంగా మారబోతుంది. రెండో స్థానంలో ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మధ్య పోటీ నెలకొంది. యోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ కు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్- 21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి- 7.2 శాతం ఓట్లు దక్కించుకున్నారు.