డొనాల్డ్ ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ.. అదే జరిగితే ఇక ఆయన కల నేరవేరడం కష్టమే!

Us Election 2024 :వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొలరాడో సుప్రీంకోర్టు గట్టి షాక్‌ తగిలింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం శ్వేతసౌధం పదవి చేపట్టేందుకు ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

Courtesy: x

Share:

వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి షాక్‌ తగిలింది. కొలరాడో రిపబ్లికన్స్‌ ప్రైమరీ బ్యాలట్‌లో పోటీ చేయకుండా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై అక్కడి సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చి 5న జరిగే కొలరాడో రిపబ్లికన్స్‌ ప్రైమరీ బ్యాలట్‌పై మాత్రమే కాకుండా నవంబర్‌ 5న జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండనుంది.

వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొలరాడో సుప్రీంకోర్టు గట్టి షాక్‌  తగిలింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం శ్వేతసౌధం పదవి చేపట్టేందుకు ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు కొలరాడో ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. కొలరాడోలో ప్రైమరీ బ్యాలెట్ నుంచి ఆయన పేరు కూడా తొలగించింది. అమెరికా చరిత్రలోనే తొలిసారి 14వ సవరణలోని మూడో సెక్షన్ ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని 4-3మెజార్టీతో న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. 

2021 నాటి యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడికి సంబంధించిన కేసులో కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది.తిరుగుబాటు చర్యలకు పాల్పడినవారు రాజ్యాంగ పదవుల్లో ఉండేందుకు అనర్హులని అమెరికా రాజ్యాంగంలో ఓ నిబంధన ఉంది. దాని ప్రకారమే కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, ఈ తీర్పుపై యూఎస్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు ట్రంప్‌కు న్యాయస్థానం అవకాశం కల్పించింది. అందుకోసం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ఈ ఉత్తర్వులపై స్టే కొనసాగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. అయితే కొలరాడో కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ట్రంప్ న్యాయవాదులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా నుంచి ట్రంప్‌ పేరును తొలగిస్తారు. అంటే వచ్చే ఏడాది మార్చి 5న జరిగే రిపబ్లికన్‌ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన ఉండరు. దీంతో వచ్చే ఏడాది నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ తీర్పు పెను ప్రభావం చూపించనుంది. 

ఇదిలా ఉండగా.. 2021 జనవరి 6 నాటి దాడి ఘటనను ట్రంప్‌ ప్రేరేపించినట్లు గతంలో కొలరాడోలోని ఓ జిల్లా కోర్టు కూడా ధ్రువీకరించింది. అయితే, అందుకు ట్రంప్‌ను అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా నిషేధించాల్సిన అవసరం లేదని అప్పుడు జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే, ఆ తీర్పును ఇప్పుడు కొలరాడో ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనర్హుడని తేల్చింది.

మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే వ్యాపారవేత్తగా రాణిస్తోన్న ఆయన అమెరిగా అధ్యక్ష పీఠంపై కన్నేశారు.