Gaza: ఆసుపత్రి కాంపౌండ్‌లోనే వందలాది మంది ఖననం..

ప్రమాదంలో నవజాత శిశువులు..

Courtesy: Canva

Share:

Gaza: గాజా నగరంలో(Gaza City) అతిపెద్ద ఆసుపత్రి అల్‌ షిఫాపై(Al Shifa Hospital) ఇజ్రాయెల్‌(Israel) నిరంతరం దాడులు కొనసాగిస్తూనే ఉంది. మూడు రోజుల్లో ఆరుగురు నవజాత శిశువులతో సహా 32 మంది రోగులు ఇక్కడ మరణించారు. దాడి కారణంగా దాదాపు వంద మంది మృతదేహాలను ఆసుపత్రి సిబ్బంది పూడ్చిపెట్టలేకపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Ministry of Health) తెలిపింది. ఈ ఆసుపత్రిలో నీరు లేదు. కరెంటు లేదు అని ఆ ఆసుపత్రి చీఫ్‌ మొహమ్మద్‌ అబు సాల్మియా(Mohammad Abu Salmiya) తెలిపారు. గాజాలోని 35 ఆసుపత్రుల్లో 23 పూర్తిగా మూతపడ్డాయి. అనేక ఆసుపత్రులలో, ఆరోగ్య కార్యకర్తలు మరియు రోగులను ఇజ్రాయెల్‌ సైన్యం(Israeli army) లోపలికి మరియు బయటికి అనుమతించడం లేదని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ నివేదించింది.

 

గాజా(Gaza) నగరానికి పశ్చిమాన ఉన్న అల్‌-రిమాల్‌(Al-Rimaal), తాల్‌ అల్‌-హవా(Tal al-Hawa), అల్‌-తుఫా(Al-Tufa), షేక్‌ అజ్లిన్‌(Sheikh Azlin) పరిసరాలు, బీచ్‌ శరణార్థి శిబిరంపై బాంబు దాడి జరిగింది. ఆర్మీ ట్యాంకులు ఉంచినందున అంబులెన్స్‌లు అక్కడికి చేరుకోలేవు. నుసెరత్‌ శరణార్థుల శిబిరంపై జరిగిన దాడిలో ఏడుగురు చనిపోయారు. ఐక్యరాజ్య సమితి పాఠశాలపై కూడా దాడి జరిగింది. గాజాలో ఇప్పటివరకు 11,360 మందికి పైగా మరణించినట్లు సమాచారం. అయితే కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతినడంతో కచ్చితమైన సమాచారం లభించడం లేదు.

 

అల్‌ షిఫా హాస్పిటల్‌(Al Shifa Hospital) సామూహిక సమాధిగా మారిందని మంగళవారం ఆ ఆసుపత్రి చీఫ్‌ మొహమ్మద్‌ అబు సాల్మియా(Mohammad Abu Salmiya) ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మందికి ప్రాణాలు పోయాల్సిన ఆసుపత్రి ఇజ్రాయెల్‌ సైన్యం(Israeli army) దిగ్బందించడం వల్ల నేడు సమాధిగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులతో సహా దాదాపు 179 మందిని ఈ ఆసుపత్రి కాంపౌండ్‌లోనే ఖననం(Burial) చేసినట్లు మంగళవారం ఆయన తెలిపారు. వైద్య సౌకర్యాల లేమితో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన నొక్కి చెప్పారు. 

 

ఈ సందర్భంగా అబు సాల్మియా(Abu Salmiya) మాట్లాడుతూ.. 'ఈ ఆసుపత్రిలో చనిపోయిన వారిని ఈ ఆసుపత్రి కాంపౌండ్‌లోనే సామూహికంగా ఖననం చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లోని(ICU) ఏడుగురు శిశువులు, 29 మంది పెద్దలు చనిపోయారు. వారిని ఆసుపత్రిలోనే ఖననం చేశాము' అని అన్నారు. ఇంకా మరికొన్ని మృతదేహాలు ఆసుపత్రి కాంప్లెక్స్‌లో పడి ఉన్నాయి. ప్రస్తుతం కరెంటు లేదని ఆయన అన్నారు. ఇక ఈ ఘటనపై ఫ్రెంచ్‌ అంతర్జాతీయ వార్తాసంస్థ ఎఎఫ్‌పి(AFP)కి చెందిన జర్నలిస్టు మాట్లాడుతూ.. 'కుళ్లిన మృతదేహాల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుంది' అని అన్నారు. ఈ ఆసుపత్రిలో ఆపరేషన్స్‌ చేసే వైద్యులకు ఈ ఘటన అమానవీయం అని పేర్కొన్నారు.

 

గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి ఇక పని చేయదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియాసిస్(Tedros Adhanom Ghebreyesus) తెలిపారు. ఆసుపత్రుల్లో(Gaza Hospitals) మరణాలు సంభవించడంపై ప్రపంచం నిశ్శబ్దంగా ఉండటం మంచిది కాదని.. ఆసుపత్రుల్లో మరణాలు, విధ్వంసం మానవ సమాజానికి మాయని మచ్చలా మిగులుతాయని హెచ్చరించారు.


కాగా, నిన్న ఆసుపత్రిలో 39 మంది పిల్లలు ఉన్నారు... నేడు 36 మంది ఉన్నారు అని పీడియాట్రిక్‌ హెడ్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ తబాషా(Mohammad Tabasha) సోమవారం మీడియాకు తెలిపారు. రోజు రోజుకి పిల్లలు చనిపోయే ప్రమాదముంది. ఒక రోజులోనో లేదా గంటల వ్యవధిలోనే చిన్నారులు మృతి చెందవచ్చు అని తబాషా అన్నారు. ఇజ్రాయెల్‌ సైన్యపు చర్యతో ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. బహుశా ఈ ఆసుపత్రిలో రోగులు, సిబ్బంది, పౌరులతో సహా దాదాపు 10 వేల మంది కంటే ఎక్కువ మంది ఆ ఆసుపత్రిలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అయితే ఇందులో ఉన్న వారిని అంతర్జాతీయ మానవతా రక్షణ చట్టం కింద రక్షించడం జరిగినట్లు ఐక్యరాజ్యసమితి(United Nations) తెలిపింది. అయితే ఆపరేషన్‌ రోగులను, సిబ్బందిని రక్షించాలని యుఎన్‌ఓ తెలిపింది.