సత్తా చూపిన ఇండియన్ నేవీ.. హైజాక్ చేసిన నౌకను రక్షించారు

Indian Navy: అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి (Indian Navy) చెందిన మెరైన్‌ కమాండోలు భారత్ సత్తా చూపారు. సముద్రపు దొంగలు హైజాక్‌ చేసిన వాణిజ్య నౌకను రక్షించారు.

Courtesy: Top Indian News

Share:

అరేబియా సముద్రంలో ఇజ్రాయెల్‌కు చెందిన కార్గో షిప్‌పై ఇటీవల డ్రోన్ దాడి జరిగిన తర్వాత భారత భద్రతా సంస్థలు అప్రమత్తంగా పని చేస్తున్నాయి. భారత నావికాదళం అరేబియా సముద్రంలో సముద్ర నిఘాను పెంచింది. తాజాగా, అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి (Indian Navy) చెందిన మెరైన్‌ కమాండోలు భారత్ సత్తా చూపారు. సముద్రపు దొంగలు హైజాక్‌ చేసిన వాణిజ్య నౌకను రక్షించారు. 

లైబీరియా జెండాతో ఉన్న కార్గో నౌక ‘ఎంవీ లిలా నార్ఫోక్‌’లో 15 మంది భారతీయ, 21 మంది ఇతర దేశాల సిబ్బందితో ప్రయాణిస్తుండగా సముద్రపు దొంగలు దాన్ని హైజాక్ చేశారు.  సోమాలియా తూర్పు అరేబియా సముద్ర తీరానికి 300 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలు ఈ మర్చంట్‌ నౌకను హైజాక్‌ చేశారు. హైజాక్‌ సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. సముద్ర గస్తీ విధుల్లో ఉన్న ఐఎన్‌ఎస్‌ చెన్నైతో సహా మరో పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో రంగంలోకి దిగింది. హైజాక్‌ అయిన నౌకలోని సిబ్బందితో కాంటాక్ట్‌ అయ్యింది. అనంతరం నౌకను వదిలి వెళ్లిపోవాల్సిందిగా హైజాకర్లను హెచ్చరించింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రానికి హైజాక్‌ గురైన నౌక వద్దకు చేరుకుని.. అందులోని 15 మంది భారతీయులు సహా మొత్తం 21 మందిని సురక్షితంగా రక్షించారు. 

అధికారులు చేసిన ఈ సాహసానికి సంబంధించిన వీడియోను భారత నేవీ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ నౌక బ్రెజిల్‌లోని పోర్ట్‌ డు అకో నుంచి బహ్రెయిన్‌లోని ఖలిఫా బిన్‌ సల్మాన్‌కు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నౌకలోకి ప్రవేశించిన ఆరుగురు సాయుధ దుండగులు హైజాక్‌ చేసినట్టు తెలుస్తున్నది. హైజాక్‌కు గురైన వెంటనే నౌక సంబంధిత సమాచారాన్ని యూకేఎంటీవో పోర్టల్‌కు పంపింది. తర్వాత వెంటనే యూకే మారిటైమ్‌ ఏజెన్సీ అప్రమత్తం చేయడంతో భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ పీ81, ప్రిడేటర్‌ డ్రోన్ల సాయంతో నౌకపై నిరంతర నిఘా పెట్టింది.

ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధం వేళ ఎర్రసముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల హిందూ మహాసముద్రంలో కూడా ఈ ఘటనలు పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం అరేబియా సముద్రంలో భార​త్ వైపు ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకలో అగ్ని ప్రమాదం సంభవించడం కలకలం రేపింది. సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తుండగా గుజరాత్‌ తీరంలో నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు భారత కోస్ట్​ గార్డు  వర్గాలు తెలిపాయి. నౌకలో ముడి చమురు ఉన్నట్లు వెల్లడించింది. డ్రోన్ దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్‌ పేలి అగ్నిప్రమాదం జరిగినట్లు రక్షణ శాఖ వర్గాలు వివరించాయి. సమాచారం అందుకున్న  కోస్ట్​ గార్డు వెంటనే ఐసీజీఎస్‌ విక్రమ్‌ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, అయితే నౌకకు కొంచం మేర నష్టం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదం నుంచి నౌకలోని 20 మంది భారతీయులు సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు.