విలాసవంతమైన భవనంలో విగత జీవులు: అమెరికాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి!

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

Courtesy: Top Indian News

Share:

వాషింగ్టన్‌: అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మసాచుసెట్స్‌ రాష్ట్రంలోని డోవర్‌ పట్టణంలోని తమ బంగ్లాలో భార్యాభర్తలు, 18 ఏండ్ల యువతి నిర్జీవంగా కనిపించారు. మృతులను రాకేశ్‌ కమల్‌ (57), టీనా (54), అరియానా (18)గా గుర్తించారు. రాకేశ్‌ మృతదేహం దగ్గర తుపాకీ లభ్యం కావడంతో వీరి మరణం వెనుక పలు అనుమానాలు వస్తున్నాయి. రెండు రోజులుగా వారి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఒక బంధువు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

రాకేశ్‌ కమల్ మృతదేహం వద్ద తుపాకీ ఉంది. దీంతో ఈ ఘటన గృహహింస వల్ల జరిగిందా..? లేక ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యనా..? అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బయటి వ్యక్తి ప్రమేయం ఉందా..? అనే కోణంలోనూ పరిశోధిస్తున్నారు.  

రాకేశ్‌ కమల్‌ దంపతులు 2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు. అయితే 2021లో దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎడ్యునోవా వెబ్‌సైట్‌ ప్రకారం రాకేశ్‌.. బోస్టన్‌ విశ్వవిద్యాలయం, ఎంఐటీ సోలన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందారు. ఆయనకు విద్యారంగంలో విశేష అనుభవం ఉంది. టీనా, హార్వర్డ్‌ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఆమెకు రెడ్‌క్రాస్‌ ఛారిటీ బోర్డులో పనిచేసిన అనుభవం ఉంది.

కమల్‌ దంపతులు మసాచుసెట్స్‌లో అత్యంత ధనవంతులు ఉండే ఓ ఖరీదైన ప్రాంతంలో 2019లో ఓ భవంతిని కొనుగోలు చేశాడు. 19వేల చదరపు విస్తీర్ణంలో ఉన్న ఈ భవంతిలో 11 బెడ్‌రూంలు ఉన్నాయి. వారు నివసించే 11 పడక గదుల విలాసవంతమైన భవనం విలువ 5 మిలియన్‌ డాలర్లు(రూ.41.26 కోట్లు)గా ఉంటుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆ ఇంట్లో వారు మాత్రమే నివసిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారి నివాసాన్ని తక్కువ ధరకే అమ్మివేసినట్టు తెలుస్తోంది. వీరు గతంలో దివాలా పిటిషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం.