అమెరికాలో శ్రీరాముడి సంబరాలు.. విదేశాల్లోనూ కనిపిస్తున్న రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలు

భారత్ లోనే కాకుండా విదేశాల్లో కూడా రామాలయ ప్రారంభోత్సవ వేడుకల ఉత్సాహం కనిపిస్తోంది. అమెరికాలో కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ దాకా యూఎస్ లోని పది రాష్ట్రాల్లో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన భారీ బిల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

Courtesy: Top Indian News

Share:

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే నగరమంతా కాషాయమయమైంది. భారత్ లోనే కాకుండా విదేశాల్లో కూడా రామాలయ ప్రారంభోత్సవ వేడుకల ఉత్సాహం కనిపిస్తోంది. అమెరికాలో కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ దాకా యూఎస్ లోని పది రాష్ట్రాల్లో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన భారీ బిల్ బోర్డులు కనిపిస్తున్నాయి.  యూఎస్ లో విశ్వహిందూ పరిషత్ విభాగం, అక్కడి దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలతో కలిసి, టెక్సాస్, ఇల్లినాయిస్ మరియు న్యూయార్క్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటివరకు 40కి పైగా బిల్‌బోర్డ్‌లను ఏర్పాటు చేసింది. సోమవారం నుండి మిస్సౌరీ మరియు అరిజోనాలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ మరియు జార్జియాలో ఇతర రాష్ట్రాలలో బిల్‌బోర్డ్‌లు ఏర్పాటయ్యాయి. జనవరి 15, సోమవారం నుండి రామ్ ఆలయంలో 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకను జరుపుకోవడానికి అరిజోనా మరియు మిస్సౌరీ నగరాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. “జీవితకాలంలో ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో హిందూ అమెరికన్లు ఉల్లాసంగా మరియు ఆనందంగా పాల్గొంటున్నారు. విగ్రహ ప్రతిష్ట జరిగే పవిత్రమైన రోజు కోసం హిందూ అమెరికన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వారి భావోద్వేగాలు పొంగిపొర్లుతున్నాయి” అని అమెరికా హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ అమితాబ్ మిట్టల్ అన్నారు. ప్రధాని మోదీ హాజరయ్యే ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’కు ముందు హిందూ ప్రవాసులు కారు ర్యాలీలు మరియు ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. అయోధ్యలో రామ్ లల్లా యొక్క ప్రాణ్-ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు జనవరి 16 నుండి ప్రారంభం కానున్నాయి.

US క్యాపిటల్ హిల్ లో 'రామాయణం అక్రాస్ ఏషియా అండ్ బియాండ్' అనే పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు మాట్లాడుతూ.. “రామాయణ ఇతిహాసం మానవ సంబంధాలు, పాలన మరియు ఆధ్యాత్మికతను తెలియచేస్తుంది. రామాయణం కూడా భౌగోళికంగా ప్రాంతాలకు వారధిగా ఉంది. ఇండో-పసిఫిక్ అంతటా, కంబోడియా నుండి ఇండోనేషియా వరకు అనేక దేశాల్లో రామాయణ ఇతిహాసం కథలు ప్రసిద్ధి చెందాయి.” అని ఆయన వివరించారు.

ఇప్పటికే కీలక సందేశం ఇచ్చిన ప్రధాని మోదీ
రాముడి ప్రాణ ప్రతిష్టకు ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలుపుతూ భారత ప్రధాని కీలక సందేశాన్ని ఇచ్చారు. ఎక్స్ (ట్విటర్) ద్వారా ఆయన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ఓ సందేశాన్ని విడుదల చేశారు. ‘అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్టకు మరో 11 రోజులు మాత్రమే ఉంది. మహోత్తర ఘట్టాన్ని ప్రారంభించే క్రతువులో భాగస్వామ్యం కావడం నా అదృష్టం. భగవంతుడు దేశ ప్రజల అందరి తరఫున  ప్రతినిధిగా నన్ను ఈ వేడుకలో భాగస్వామిని చేస్తున్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు నుంచి 11 రోజుల ప్రత్యేక పూజను ప్రారంభిస్తున్నాను. ఈ క్రతువులో నేను ప్రజలందరి ఆశీస్సులు కోరుతున్నాను. ఈ సమయంలో నా భావాలను మాటల్లో చెప్పడం చాలా కష్టం. నా జీవితంలో మొదటిసారిగా మాటల్లో వర్ణించలేని భావోద్వేగాలకు గురవుతున్నాను. నేను భిన్నమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నాను. నాకు, ఇది మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ సందర్భంగా నా భావాలు తెలపడం కష్టంగా ఉన్నా.. నా తరఫు నుంచి చేయగలిగిందతా చేస్తాను. మీరు కూడా నా పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటున్నారని భావిస్తున్నా." అని వెల్లడించారు. 

భారీగా భద్రతా ఏర్పాట్లు
అయోధ్య నగరంలో ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ శాఖ భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నది. అయోధ్యలో కార్యక్రమం దేశానికి చాలా కీలకమైన రోజని.. ఇందుకోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పెషల్‌ డీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. సీసీటీవీల ద్వారా నిఘాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగే 22న, ఆ తర్వాత నుంచి రాముడి దర్శనానికి వచ్చే భక్తులందరికీ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అయోధ్యలో 10వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నగర భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. 

గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని తీసుకురానున్న ప్రధాని
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేళ రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పూజ మండపం నుంచి గర్భగుడికి 25 సెకన్లలో మోదీ చేరుకుంటారు. కాశీకి చెందిన పండిట్‌ లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 17న అయోధ్యలో నిర్వహించతలపెట్టిన శ్రీరాముని విగ్రహ ఊరేగింపును అధిక రద్దీ ఆలోచనతో రద్దు చేశారు. మకర సంక్రాంతి నుంచి జనవరి 22 వరకు అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ‘ఎక్స్‌’లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. 

వేడుకకు అద్వానీ వస్తారు: వీహెచ్పీ 
అయోధ్యలో 22న జరిగే రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు బీజేపీ అగ్రనేత ఎల్‌‌‌‌కే అద్వానీ(96) కూడా హాజరవుతారని వీహెచ్‌‌‌‌పీ(విశ్వహిందూ పరిషత్) అధ్యక్షుడు అలోక్ కుమార్ వెల్లడించారు. అయితే, పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి హాజరవుతారా? లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆరోగ్యం, వయస్సు  దృష్ట్యా అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు అయోధ్యలో జరిగే వేడుకలకు హాజరయ్యే అవకాశం లేదని రామజన్మభూమి ట్రస్ట్ గత నెలలో పేర్కొంది.