జపాన్ లో భారీ భూకంపం.. ప్రజలను వణికిస్తున్న సునామీ హెచ్చరికలు

Japan Earth Quake: ప్రపంచ దేశాలన్నీ నూతన సంవత్సరాది సంబరాల్లో మునిగితేలుతుండగా, జపాన్ (Japan) మాత్రం సునామీ భయంతో బిక్కుబిక్కుమంటోంది. జపాన్ ను భారీ భూకంపం (earthquake) వణికించింది. ఇషికావా రాష్ట్రంలో సోమవారం 7.6 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి.

Courtesy: IDL

Share:

టోక్యో: ప్రపంచ దేశాలన్నీ నూతన సంవత్సరాది సంబరాల్లో మునిగితేలుతుండగా, జపాన్ (Japan) మాత్రం సునామీ భయంతో బిక్కుబిక్కుమంటోంది. జపాన్ ను భారీ భూకంపం (earthquake) వణికించింది. ఇషికావా రాష్ట్రంలో సోమవారం 7.6 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జపాన్‌ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగటి, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

జపాన్ లో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు భారీ భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా జపాన్ పశ్చిమ తీరంలో సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరించాయి. ఈ క్రమంలో ఇషికావా రాష్ట్రంలోని వజిమా నగరాన్ని 1.2 మీటర్ల ఎత్తున సునామీ అలలు తాకాయి. కాగా, ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థను ఉటంకిస్తూ ఏఎఫ్ పీ మీడియా సంస్థ వెల్లడించింది. 2011 తర్వాత జపాన్ కు సునామీ హెచ్చరికలు జారీ కావడం ఇదే ప్రథమం. 

కాగా, భూకంపం ప్రభావంతో జపాన్ పశ్చిమ తీరప్రాంత రాష్ట్రాలైన ఇషికావా, నిగాటా, తొయామాలో రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పక్కకి ఒరిగిపోయాయి. రిక్టర్ స్కేలుపై 7కి పైగా తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ధాటికి ఇషికావా తీర ప్రాంతంలోని ఇళ్లు ఊగిపోయాయి. దాంతో ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. మరికొన్ని సార్లు ప్రకంపనలు రావడంతో అధికారుల హెచ్చరిక మేరకు ప్రజలు మళ్లీ తమ నివాసాల్లోకి వెళ్లకుండా వీధుల్లోనే ఉన్నారు. అలాగే జపాన్‌ తీరం వెంబడి భూకంప కేంద్రానికి 300కి.మీ పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉందని హవాయికి చెందిన సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. అవి ఐదు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ భూ ప్రకంపనలతో అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా..? అనేది తనిఖీ చేస్తున్నామని హొకురికు ఎలక్ట్రిక్‌ పవర్‌ సంస్థ వెల్లడించింది. 

సునామీ నేపథ్యంలో, తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. జపాన్ ప్రధాని కిషిదా నేరుగా ప్రజలకు సందేశం అందించారు. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.

ఈ భారీ భూకంపంతో జపాన్‌తో పాటు ఉత్తర కొరియా, రష్యాకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ హెచ్చరికలను రష్యా అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించింది. జపాన్‌కు సమీపంలో ఉన్న సఖాలిన్ ద్వీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు రష్యా ఎమర్జెన్సీ మంత్రి వెల్లడించారు.

దాదాపు 21 భూకంపాలు

ద్వీప దేశం జపాన్‌ వరుస భూకంపాలతో నూతన సంవత్సరం గజగజలాడిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో భూకంప లేఖినిపై 4.0 తీవ్రత కంటే అధిక స్థాయిలో ఏకంగా 21 భూకంపాలు నమోదయ్యాయి. దీంతో ఇషికావా ద్వీపకల్పంలో వాజిమా పోర్టులో 4.21 గంటల సమయంలో దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో సునామీ అలలను గుర్తించారు. వాజిమాలో చాలా వీధులు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రహదారులపై భారీగా పగుళ్లు ఏర్పాడ్డాయి. 

అప్రమత్తమైన భారత రాయబార కార్యాలయం 
జపాన్‌లో భూకంప తీవ్రత కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో టోక్యోలోని భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం భారత రాయబార కార్యాలయ సిబ్బంది ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీలతో ఒక ప్రకటన విడుదల చేసింది. భూకంపం, సునామీకి సంబంధించిన సమాచారం కోసం ఎవరైనా సంప్రదించవచ్చని తెలిపింది.  స్థానిక ప్రభుత్వ సూచనలు పాటించాలని ప్రకటనలో సూచించింది.