భూకంపం సమయంలో జపాన్ లోనే జూనియర్ ఎన్టీఆర్.. షాక్ అయ్యానని వెల్లడి

Junior NTR: జపాన్‌లో వరుస భూకంపాల ఘటనపై టాలీవుడ్‌ స్టార్‌ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) తాజాగా స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Courtesy: Top Indian News

Share:

టోక్యో: జపాన్ దేశాన్ని వరుస భూకంపాలు అతలాకుతలం చేశాయి. సోమవారం దాదాపు 155 సార్లు భూమి కంపించింది. ఈ భూకంపాల ధాటికి ప్రాణనష్టం తక్కువే అయినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా. వరుస ప్రకంపనలతో వేలాది ఇండ్లు, భవనాలు కుప్పకూలిపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఫిషింగ్ బోట్లు మునిగిపోయి ఒడ్డుకు కొట్టుకుపోయాయి. రోడ్లు కుంగిపోయి పగుల్లు ఏర్పడ్డాయి, వాటర్ సప్లై నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది, బుల్లెట్ ట్రైన్ ను ఆపేశారు. ఇప్పటి వరకు 24 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా వందలాది మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. మరో వైపు జపాన్ వాతావరణ సంస్థ సునామీ  హెచ్చరికల తీవ్రతను తగ్గించింది. 

1.2 మీటర్ల ఎత్తులో అలలు
జపాన్ పశ్చిమ తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వరుస భూకంపాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. జపాన్‌‌ తీరం వెంబడి భూకంప కేంద్రానికి 300 కి.మీ పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే చాన్స్ ఉందని హవాయికి చెందిన సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. హోక్కాయిడో నుంచి నాగసాకి దాకా సునామీ ముప్పు ఉన్నట్లు తెలిపింది. తీర ప్రాంతం నుంచి దూరంగా.. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఇషికావాలోని వాజిమా పోర్టులో దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో అలలను గుర్తించారు.

ఎన్టీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి
కాగా, జపాన్‌లో వరుస భూకంపాల ఘటనపై టాలీవుడ్‌ స్టార్‌ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) తాజాగా స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ గతవారం కుటుంబంతో కలిసి వెకేషన్‌ కోసం జపాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. వ్యక్తిగత పర్యటన నిమిత్తం తారక్‌ జపాన్‌లో వారం రోజులపాటు గడిపారు. ఇక టూర్‌ ముగించుకొని సోమవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇంతలోనే అక్కడ వరుస భూకంపాలు సంభవించాయన్న విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌.. సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. ‘జపాన్‌ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చాను. గతవారం అంతా అక్కడే గడిపాను. జపాన్‌లో భూకంపం వార్త విని షాక్‌ అయ్యాను. ఆ ప్రాంతంలో భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. అక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్‌.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’లో నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే 80 శాతం మేర చిత్రీకరణ పూర్తయింది. దేవరలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్‌ కానుంది. తొలి భాగం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

2011లోనూ భారీ భూకంపం
2011, మార్చిలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 9గా నమోదైంది. అప్పుడు సునామీ రావడంతో 18,500 మందికిపైగా చనిపోయారు. ఫుకుషిమాలోని న్యూక్లియర్ ప్లాంట్ కూడా దెబ్బతిన్నది. మూడు రియాక్టర్లు ధ్వంసం అయ్యాయి. చెర్నోబిల్ తర్వాత అత్యంత తీవ్రమైన న్యూక్లియర్ ప్రమాదంగా ఇది నిలిచింది. తర్వాత.. 2022, మార్చిలో ఫుకుషిమా తీరంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.