భారత పర్యటనకు మాల్దీవుల అధ్యక్షుడి సన్నాహాలు.. ఎప్పుడంటే?

భారత్‌ (India)తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

Courtesy: Top Indian News

Share:

భారత్‌ (India)తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత పర్యటనకు వచ్చేందుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ బీచ్‌లో పర్యటన తర్వాత మాల్దీవులకు చెందిన మంత్రులు మోడీని విమర్శించడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మాల్దీవులకు వ్యతిరేకంగా భారత్ కు చెందిన పర్యాటకులు తమ ప్రయాణ టికెట్లను భారీగా క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పాటు పలు విమాన సంస్థలు సైతం అక్కడ తమ సర్వీసులను నడిపించేందుకు నిరాకరించాయి. ఈ క్రమంలో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. 

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు త్వరలోనే భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం మాల్దీవుల అధికారులు.. అధ్యక్షుడి దిల్లీ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజా విభేదాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని, అంతకంటే ముందుగానే మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. గతేడాది యూఏఈలో జరిగిన కాప్‌28 పర్యావరణ సదస్సులో భారత ప్రధాని మోదీతో ముయిజ్జు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే ఆయన దిల్లీ పర్యటనపై చర్చ జరిగినట్లు సమాచారం.

గతేడాది నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత టర్కీ, యూఏఈ, చైనా దేశాల్లో పర్యటించారు. ముయిజ్జు ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ సందర్భంగా బీజింగ్‌ చేపట్టిన బీఆర్‌ఐ ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. ముయిజ్జుకు చైనా అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. ఇక, భారత్‌తో విభేదాల నేపథ్యంలో స్వదేశంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనపై అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి.