మా దేశానికి టూరిస్టులను పంపండి.. చైనాను అభ్యర్థించిన మాల్దీవుల అధ్యక్షుడు

Maldives: డ్రాగన్ దేశం చైనాపై మాల్దీవులు ఆశలు పెంచుకుంటోంది. తమ దేశానికి టూరిస్టుల సంఖ్యను పెంచేందుకు చైనాపై ఆశలు పెట్టుకుంది.

Courtesy: Top Indian News

Share:

ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతర పరిణామాలతో భారత్, మాల్దీవుల మధ్య విభేదాలు మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారతీయులు, ఇక్కడి టూరిస్టులు బాయ్ కాట్ మాల్దీవులు అనే నినాదాన్ని మూకుమ్మడిగా లేవనెత్తడంతో ఆ దేశం దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లింది. ఈ క్రమంలో డ్రాగన్ దేశం చైనాపై మాల్దీవులు ఆశలు పెంచుకుంటోంది. తమ దేశానికి టూరిస్టుల సంఖ్యను పెంచేందుకు చైనాపై ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు తమ దేశానికి చైనా నుంచి భారీగా టూరిస్టులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అక్కడి వాణిజ్యవేత్తలను ప్రత్యక్షంగా కోరారు. 

ఈ సందర్భంగా చైనాను తమ అభివృద్ధి భాగస్వామిగా ముయిజ్జు తెలిపారు. అంతేకాకుండా, రెండు దేశాల మధ్య దీర్ఘకాల సంబంధం ఉన్నట్లు ఆయన తెలిపారు.  అంతేకాకుండా, కరోనా మహమ్మారికి ముందు మాల్దీవుల పర్యాటక రంగంలో చైనా పాత్రను హైలెట్ చేశారు. "చైనా ఈ స్థానాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలనేది నా అభ్యర్థన." అని మొయిజ్జు వెల్లడించారు. 

వివాదం ఎక్కడ మొదలైంది?
ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వాటిలో ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మరియం షియునా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మరియం సోషల్‌ మీడియా వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారతీయులు తీవ్రంగా ఖండించారు. చాలామంది ప్రముఖులు, సామాన్యులు కూడా మాల్దీవులు మంత్రి వ్యాఖ్యలను సోషల్‌మీడియాలో తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ మాల్దీవులు పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నామని భారతీయ నెటిజన్లు సోషల్‌ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా, పలు విమానయాన సంస్థలు మాల్దీవులకు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించాయి. 

భారతీయులు పూర్తిగా మాల్దీవులను రద్దు చేసుకుంటే జరగబోయే ప్రమాదాన్ని అర్థం చేసుకున్న మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్‌ చేసింది మాల్దీవులు ప్రభుత్వం. మంత్రులు మరియం షియునా, మల్షా షరీఫ్ , మహ్జూమ్ మజీద్ సస్పెన్షన్‌కు గురైనట్లు మాల్దీవుల స్థానిక మీడియా వెల్లడించింది. మంత్రి మరియం షియునా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అని మాల్దీవులు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించింది. ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవులు ప్రభుత్వం సస్పెన్‌ వేటు వేయటం గమనార్హం.