నిన్న సిరాజ్.. నేడు బుమ్రా.. చుక్కలు చూపించిన భారత పేసర్లు!

Bumrah: కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుల్లో భారత్ పట్టు బిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే చిత్తయిన సఫారీలు రెండో ఇన్నింగ్స్ లోనే అదే దారిలో పయనిస్తోంది.

Courtesy: x

Share:

కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుల్లో భారత్ పట్టు బిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే చిత్తయిన సఫారీలు రెండో ఇన్నింగ్స్ లోనే అదే దారిలో పయనిస్తోంది. 3 వికెట్లకు  62 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా భారత పేసర్  బుమ్రా ధాటికి విలవిల్లాడిపోయింది. మరో 114 పరుగులు చేసి.. మిగతా 7 వికెట్లు కోల్పోయింది. మొత్తం 176 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌ ముందు 79 పరుగుల లక్ష్యం నిలిపింది.

బుమ్రా ధాటికి తొలి సెషన్ లోనే దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయింది. గురువారం నాటి ఆటలో భాగంగా తొలి ఓవర్లోనే డేవిడ్ బెడింగ్‌హామ్‌ను పెవిలియన్‌కు పంపాడు బుమ్రా. 17.6వ ఓవర్‌ వద్ద 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో బెడింగ్‌హామ్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఆ మరుసటి నాలుగో ఓవర్లో బుమ్రా మరోసారి తన బౌలింగ్‌ పదును రుచి చూపించాడు. 21.1 ఓవర్‌ వద్ద కైలీ వెరెనె(9) వికెట్‌ పడగొట్టాడు. ఆ తర్వాత మళ్లీ 23.5వ ఓవర్‌ వద్ద మార్కో జాన్సెన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు బుమ్రా. తద్వారా రెండో రోజు తొలి సెషన్‌లోనే మూడో వికెట్‌ కూడా దక్కించుకున్నాడు.

ఆ తర్వాత కేశవ్‌ మహరాజ్‌ను పెవిలియన్‌కు పంపి నాలుగో వికెట్‌ తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఇక మొదటి రోజు ఆటలో భాగంగా బుమ్రా ట్రిస్టన్‌ స్టబ్స్‌ను అవుట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ఇప్పటికే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. ఇదిలా ఉంటే.. బుమ్రా ధాటికి 117 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా.. 176 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. సెంచరీ హీరో ఐడెన్‌ మార్క్రమ్‌ వికెట్‌ను మహ్మద్‌ సిరాజ్‌ దక్కించుకోగా.. ప్రసిద్‌ కృష్ణ ఒక వికెట్‌ తీశాడు. ఆఖర్లో బుమ్రా తన ఆరో వికెట్‌గా లుంగి ఎంగిడిని పెవిలియన్‌కు పంపి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఇక సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో సిరాజ్‌ ఆరు వికెట్లతో కీలక పాత్ర పోషించగా.. రెండో రోజు ఆటలో బుమ్రా ఆరేయడం(ఆరు వికెట్లు తీయడం) విశేషం.

భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 6, ముకేశ్ కుమార్ 2, మహమ్మద్ సిరాజ్ 1, ప్రసిద్ధ్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టారు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ ఛేదిస్తే.. ఈ మ్యాచు గెలవడంతో పాటు.. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేస్తుంది.

నిన్న 6 వికెట్లతో చెలరేగిన సిరాజ్
బుధవారం మ్యాచ్ లో సిరాజ్‌ (6-15) సఫారీలను బెంబేలెత్తించాడు. దీంతో భారత్‌తో కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న కీలక టెస్టులో సౌతాఫ్రికా చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌కు దాసోహమైన సఫారీలు.. 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిషేధం ఎత్తివేశాక ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. ఇదివరకు దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోరు 73గా ఉంది. స్వదేశంలో మాత్రం.. ఆ జట్టుకు ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు 2016లో జోహన్నస్‌బర్గ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 83 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు.