తొలి టీ-20లో దుమ్మురేపిన టీమిండియా.. దూబే మెరుపు ఇన్నింగ్స్

Mohali T-20 match: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. మొహాలి వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Courtesy: x

Share:

ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. మొహాలి వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 159 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. టీమిండియా మరో 15 బంతులు మిగిలివుండగానే దాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

ఆదిలోనే భారత్ కు దెబ్బ
టార్గెట్ ఛేదనలో భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు రెండేళ్ల తరువాత టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ(0) ఖాతా తెరవకుండానే రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి ఓవర్‌లోనే వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(23) వరుస ఫోర్లతో అలరించాడు. 28 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబె సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన అతను అఫ్గాన్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. కీలక వికెట్లు తీస్తూ అఫ్గాన్ ఒత్తిడి పెంచినా దూబె మాత్రం దూకుడు ఆపలేదు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో అతనికి ఇది రెండో అర్ధ సెంచరీ. శివమ్ దూబె(60 నాటౌట్)తోపాటు రింకు సింగ్(16 నాటౌట్) మెరవడంతో భారత్ విజయం లాంఛనమైంది. 18వ ఓవర్‌లో దూబె వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. దూబేకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. 

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ రనౌట్‌ 0; శుభ్‌మన్‌ గిల్‌ (స్టంప్డ్‌) రహ్మనుల్లా (బి) ముజీబ్‌ 23; తిలక్‌వర్మ (సి) నైబ్‌ (బి) ఒమర్‌జాయ్‌ 26; శివమ్‌ దూబె నాటౌట్‌ 60; జితేశ్‌ శర్మ (సి) ఇబ్రహీం (బి) ముజీబ్‌ 31; రింకు నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (17.3 ఓవర్లలో 4 వికెట్లకు) 159.

ఆఫ్గాన్ బ్యాటింగ్ ఇలా
మహమ్మద్‌ నబీ (42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్‌(29; 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్), ఇబ్రహీం (25), రహ్మానుల్లా (23) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, ముఖేశ్‌ కుమార్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ ఇరు జట్ల మధ్య ఆదివారం(జనవరి 14) ఇండోర్ వేదికగా రెండో టీ20 జరగనుంది.

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (స్టంప్డ్‌) జితేశ్‌ (బి) అక్షర్‌ 23; ఇబ్రహీం జద్రాన్‌ (సి) రోహిత్‌ (బి) దూబె 25; అజ్మతుల్లా (బి) ముకేశ్‌ 29; రహ్మత్‌ షా (బి) అక్షర్‌ 3; నబి (సి) రింకు (బి) ముకేశ్‌ 42; నజిబుల్లా నాటౌట్‌ 19; కరీమ్‌ జనత్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 158.

నా స్టైల్ లో బ్యాటింగ్ చేయాలనుకున్నా
మ్యాచ్ అనంతరం శివమ్ దూబె మాట్లాడుతూ.. ‘ఆటను చాలా ఎంజాయ్ చేశా. చాలా రోజుల తర్వాత ఆడటం, నం.4లో బ్యాటింగ్ రావడం నాపై ఒత్తిడి కలిగించింది. కానీ, మైండ్‌లో మాత్రం నా స్టైల్‌లో బ్యాటింగ్ చేయాలని అనుకున్నా. టీ20ల్లో సిక్స్‌లు కొట్టగలనని నాకు తెలుసు. మ్యాచ్ అనంతరం రోహిత్ నా ఆటను మెచ్చుకున్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో ఆటను మెరుగుపర్చుకోవాలని చెప్పాడు.’ అని శివమ్ దూబె చెప్పుకొచ్చాడు.