క్రికెట్ దిగ్గజం సచిన్ కూ తప్పని 'డీప్ ఫేక్' కష్టాలు.. కఠిన చర్యలు తీసుకోవాలని వినతి

Sachin Tendulkar Deepfake Video: భారత క్రికెట్ దిగ్గజం సచిత్ తెందుల్కర్ కూడా డీప్ ఫేక్ పంజాకు బాధితుడయ్యాడు. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు డీప్‌ఫేక్‌ వీడియోలతో మోసాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Courtesy: Top Indian News

Share:

భారత క్రికెట్ దిగ్గజం సచిత్ తెందుల్కర్ కూడా డీప్ ఫేక్ పంజాకు బాధితుడయ్యాడు. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు డీప్‌ఫేక్‌ వీడియోలతో మోసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రముఖ సినీ నటి రష్మిక మందాన్న సహా పలువురు డీప్ ఫేక్ బాధితులవ్వగా.. తాజాగా నేరగాళ్లు సచిన్ తెందుల్కర్ పై కూడా డీప్ ఫేక్ పంజా విసిరారు. ఓ గేమింగ్‌ యాప్ కు సచిన్ ప్రచారం చేస్తున్నట్లు క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. కాగా, దీన్ని మాస్టర్‌ బ్లాస్టర్‌ ఖండించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్‌ మీడియాలో స్పష్టతనిచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వీడియోలో ఏం ఉందంటే..స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ (Skyward Aviator quest) అనే గేమింగ్‌ యాప్‌ను సచిన్ ప్రమోట్‌ చేసినట్టుగా ఉంది. ఈ ఆన్‌లైన్ గేమ్‌ను ఆడటం ద్వారా తన కూతురు సారా టెండుల్కర్ రోజూ వేల రూపాయలను సంపాదిస్తోందంటూ సచిన్ టెండుల్కర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఆ వీడియోలో ఉంది. ఏవియేటర్ క్వెస్ట్ ద్వారా డబ్బులను ఇంత సులభంగా సంపాదించవచ్చా? అని తనకు ఆశ్చర్యం కలుగుతుంటుందని, ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సచిన్ సూచిస్తున్నట్లు వీడియోలో ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వైరల్‌గా మారింది.

అయితే, ఆలస్యంగా ఇది సచిన్ ద్రుష్టికి రావడంతో ఆయన స్పందించారు. ఈ వీడియోను మాస్టర్‌ బ్లాస్టర్‌ తీవ్రంగా ఖండించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్‌ మీడియాలో స్పష్టతనిచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను సచిన్‌ తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేశారు.  ‘ఈ వీడియోలు ఫేక్ వీడియోలు. టెక్నాలజీని ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి వీడియోలు, యాడ్స్‌, యాప్స్‌ గనక మీ దృష్టికి వస్తే అవి సంబంధిత అధికారులకు వెంటనే రిపోర్ట్‌ చేయండి. ఇలాంటి వీడియోల పట్ల సోషల్‌ మీడియా అప్రపమత్తంగా ఉండాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని సచిన్ ట్విటర్ ద్వారా కోరాడు. డీప్ ఫేక్ వీడియో వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి సచిన్ తీసుకెళ్లారు. ట్విటర్ లో కేంద్ర ఐటీ శాఖను ట్యాగ్ చేశారు. 

రష్మిక వీడియోతో డీప్ ఫేక్ సంచలనం
గతంలో సోషల్‌మీడియా స్టార్ జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి డీప్ ఫేక్ వీడియో క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. చూడటానికి అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై అమితాబ్‌ బచ్చన్‌, కీర్తిసురేశ్‌, విజయ్‌ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గతంలో సచిన్‌ కుమార్తె సారా కూడా డీప్‌ ఫేక్‌ బారిన పడిన విషయం తెలిసిందే. టీమ్‌ఇండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సారా ఉన్నట్లు మార్ఫింగ్‌ ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది. సారా తన సోదరుడు అర్జున్‌ తెందూల్కర్‌తో ఉన్న ఫొటోను డీప్‌ఫేక్‌ చేశారు. అర్జున్‌ ముఖం స్థానంలో గిల్‌ ఫొటోను మార్చి వైరల్‌ చేశారు. దీనిపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.