ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేస్తామని అనుకోలేదు: సిరాజ్‌

Mohammed Siraj: ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేస్తామని తాను అస్సలు అనుకోలేదని టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్‌ అన్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో సాధ్యం కాని దాన్ని ఈసారి చేసి చుపించా అని తెలిపాడు.

Courtesy: Top Indian News

Share:

కేప్ టౌన్: ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేస్తామని తాను అస్సలు అనుకోలేదని టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్‌ అన్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో సాధ్యం కాని దాన్ని ఈసారి చేసి చుపించా అని తెలిపాడు. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూల్చడంలో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ (Siraj) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తొమ్మిది ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టాడు. రెండో టెస్టులో భారత్, దక్షిణాఫ్రికా (SA vs IND) బౌలర్ల దెబ్బకు ఒకే రోజు 23 వికెట్లు కూలాయి. దీంతో టీమ్‌ఇండియా తొలి రోజే రెండోసారి బౌలింగ్‌ ప్రారంభించడం గమనార్హం. మొదటి రోజు మ్యాచ్‌ ముగిసిన అనంతరం సిరాజ్‌ మాట్లాడాడు. ‘ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌కు వస్తావని ఊహించావా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ ఐదు ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చాడు. ఇంకా వికెట్ తీయలేదు.

రెండో టెస్ట్ మొదటి రోజు మ్యాచ్‌ ముగిసిన అనంతరం మహమ్మద్ సిరాజ్‌ మీడియాతో మాట్లాడాడు. ‘‘నిజంగా ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేస్తామని అనుకోలేదు. ఇప్పటికైతే మ్యాచ్‌లో మేం ఒకడుగు ముందే ఉన్నాం. క్రికెట్‌లో సానుకూల, ప్రతికూల పరిస్థితులుంటాయి. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించానని అనుకుంటున్నా. గత మ్యాచ్‌లో నేను ఏం చేయలేకపోయానో.. ఇప్పుడు ఈ టెస్టులో అది చేసి చూపించా. ఒకే విధమైన బంతులు నిలకడగా వేసి ఫలితం సాధించా. సెంచూరియన్‌ మాదిరిగానే కేప్‌ టౌన్‌ కూడా పేస్‌కు అనుకూలంగా ఉంది.’’ అని సిరాజ్‌ తెలిపాడు. 

‘‘తొలి టెస్టు మాదిరిగా కాకుండా.. ఈసారి బుమ్రాతో కలిసి కొన్ని మెయిడిన్లు వేశాం. దీంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి పిచ్‌పై నిలకడగా లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తే తప్పకుండా వికెట్లు దక్కుతాయని తేలింది. అలా కాకుండా వైవిధ్యం కోసం ప్రయత్నిస్తే అయోమయానికి గురికావాల్సి ఉంటుంది. మరోవైపు సీనియర్‌ బౌలర్‌, వికెట్‌ కీపర్‌ ఇచ్చే సూచనలూ చాలా కీలకం. సరైన లెంగ్త్‌తో బంతులు వేస్తే వికెట్లు వస్తాయనేది పసిగడితే చాలు. అందుకే తరచూ వారితో చర్చిస్తూ ఉంటే మన పని ఇంకా తేలికవుతుంది. ఒకవేళ మన బౌలింగ్‌లో నాలుగైదు బౌండరీలు కొట్టినా.. వికెట్‌ కోసం ఏ లెంగ్త్‌లో బంతిని వేయాలనేది తెలుస్తుంది. రెండో రోజు ఏం జరుగుతుందనేది ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం మేం ఇంకా 36 పరుగుల ఆధిక్యంలోనే ఉన్నాం. వారిని త్వరగా ఆలౌట్‌ చేసి లీడ్‌ సాధించకుండా చూస్తాం’’ అని సిరాజ్‌ తెలిపాడు. తొలి టెస్టులో 91 పరుగులు ఇచ్చి రెండు వికెట్లను మాత్రమే తీశాడు.