హైదరాబాద్ వేదికగా ఫార్ములా-ఈ రేస్‌ రద్దు.. ప్రకటించిన ఈ ప్రిక్స్ సంస్థ

Formula-E: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు 'ఫార్ములా ఈ' వెల్లడించింది.

Courtesy: x

Share:

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు 'ఫార్ములా ఈ' వెల్లడించింది. దీంతో భాగ్యనగరంలో మరోసారి కారు రేసింగ్‌ పోటీలను వీక్షించాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ఈ విషయాన్ని 'ఫార్ములా -ఇ' అధికారికంగా ధ్రువీకరించింది. తెలంగాణ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో  రద్దు చేస్తున్నట్లు 'ఫార్ములా ఈ' నిర్వాహకులు ప్రకటించారు. హైదరాబాద్ కి బదులుగా హాంకుక్ మెక్సికో సిటీలో ఈ రేస్ నిర్వహించనున్నట్లు  ఫార్ములా ఈ  ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా రేస్ నిర్వహణపై గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసులు జారీ చేస్తామని ఫార్ములా ఈ ఆపరేషన్స్ వింగ్‌ పేర్కొం‍ది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఫార్ములా ఈ సంస్థ ఈ ప్రిక్స్‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్లతో కలిసి 2023, అక్టోబర్ 30న రేసింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆ అగ్రిమెంట్‌ రద్దు అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫార్ములా- ఈ రేసింగ్‌ మెక్సికోకు తరలి వెళ్లి పోయింది. కాగా గతేడాది ఫిబ్రవరిలో  ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ట్యాంక్ బండ్ వద్ద జరిగిన విషయం తెలిసిందే. 

కాంగ్రెస్ నిర్ణయం సరికాదన్న కేటీఆర్

భాగ్యనగరంలో జరగాల్సిన ఫార్ములా - ఈ రేస్‌ రద్దుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన నిర్ణయమని విమర్శించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు సరికావని.. ఈ ప్రిక్స్‌ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా మన బ్రాండ్‌ను పెంచుతాయని చెప్పారు. అలాంటి ఈవెంట్‌లు నిర్వహించకపోవడం తిరోగమన స్థితికి వెళ్లడమేనన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫార్ములా - ఈ రేస్‌ను బీఆర్ఎస్ హయాంలో చక్కటి అవకాశంగా ఉపయోగించుకున్నట్లు పేర్కొన్నారు. సస్టయినబుల్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించినట్లు చెప్పారు.