వారెవ్వా అనిపించిన సిరాజ్, దడుచుకున్న దక్షిణాఫ్రికా ప్లేయర్లు, 55కే ఆలౌట్

IND vs SA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్లు అదరగొట్టారు. ముఖ్యంగా సిరాజ్‌ (6-15) సఫారీలను బెంబేలెత్తించాడు.

Courtesy: Top Indian News

Share:

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్లు అదరగొట్టారు. ముఖ్యంగా సిరాజ్‌ (6-15) సఫారీలను బెంబేలెత్తించాడు. దీంతో భారత్‌తో కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న కీలక టెస్టులో సౌతాఫ్రికా చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌కు దాసోహమైన సఫారీలు.. 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిషేధం ఎత్తివేశాక ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. ఇదివరకు దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోరు 73గా ఉంది. స్వదేశంలో మాత్రం.. ఆ జట్టుకు ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు 2016లో జోహన్నస్‌బర్గ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 83 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు.

నిషేధం ఎత్తివేయకముందు సౌతాఫ్రికా అత్యల్ప స్కోరు 30 పరుగులుగా నమోదైంది. 1896లో గబేరా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో సఫారీలు.. 30 రన్స్‌కే చేతులెత్తేశారు. కేప్‌టౌన్‌లో కూడా 1899లో ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. అయితే ఇదంతా నిషేధం విధించకముందు. 1971లో వర్ణ వివక్ష కారణంగా ఆ జట్టుపై ఐసీసీ రెండు దశాబ్దాల (21 ఏండ్ల) పాటు నిషేధం విధించింది. 1992లో ఆ జట్టు తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అడుగుపెట్టింది. నిషేధం ఎత్తివేశాక టెస్టులలో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు.

సౌతాఫ్రికాలో సిరాజ్‌ ఆరు వికెట్లు తీయడం భారత బౌలింగ్‌ తరఫున మూడో అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు 2022లో శార్దూల్‌ ఠాకూర్‌.. జోహన్నస్‌బర్గ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. 2011లో హర్భజన్‌ సింగ్‌ కూడా.. కేప్‌టౌన్‌లో ఏడు వికెట్లు తీశాడు. మూడో స్థానంలో సిరాజ్‌ (6-15) ఉన్నాడు. ఈ క్రమంలో సిరాజ్‌.. కుంబ్లే (6-53), శ్రీనాథ్‌ (6-76) లను అధిగమించాడు. కేప్‌టౌన్‌లో భారత బౌలర్లలో భజ్జీ తర్వాత సిరాజ్‌దే రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఈ టెస్టులో బెడింగ్‌హామ్ (12), వెరినే (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బుమ్రా, ముకేశ్‌ కుమార్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.