కోహ్లీ కూతురు వామిక బర్త్ డే.. అందుకే టీ20 కి కింగ్ దూరం!

King Kohli: ఆఫ్గనిస్థాన్ తో జరగబోయే పొట్టి ఫార్మాట్‌లో కింగ్ కోహ్లీని చూడాలని ఆసక్తిగా ఉన్న టీమిండియా అభిమానులకు షాక్ తగిలింది.

Courtesy: Top Indian news

Share:

ఆఫ్గనిస్థాన్ తో జరగబోయే పొట్టి ఫార్మాట్‌లో కింగ్ కోహ్లీని చూడాలని ఆసక్తిగా ఉన్న టీమిండియా అభిమానులకు షాక్ తగిలింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోహ్లీ మొదటి మ్యాచ్‌లో ఆడటం లేదని జట్టును ఉద్దేశించి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. తొలి మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండడని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్లే కోహ్లీ ఆ మ్యాచ్ ఆడడం లేదని అన్నాడు. 

అఫ్గానిస్తాన్‌తో గురువారం నుంచి టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్లను కాదని సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli)కి బీసీసీఐ చోటు కల్పించింది. ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గురువారం జరగబోయే తొలి మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడం లేదని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పడం గమనార్హం. జనవరి 11న కోహ్లీ కూతురు వామిక పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే కుటుంబ సమేతంగా వేడుక చేసుకోవాలని భావించి తొలి టీ20 మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది. రెండు, మూడో మ్యాచ్‌లకు మాత్రం కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

మ్యాచ్‌కు ఒకరోజు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్ రోహిత్ శర్మతో జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ ఆడకపోతే మూడో నంబర్‌లో శుభ్‌మన్ గిల్‌ను పంపే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా జట్టులో లేకపోవడంతో శివమ్ దూబేకి జట్టులో అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నాయి. దూబే కి ఛాన్స్ ఇస్తే ఆల్‌రౌండర్‌గా పెర్ఫార్మెన్స్ కనబరిచే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్‌తో పాటు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగల సత్తా అతనికి ఉంది. రింకూ సింగ్ కూడా ఆడటం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు బ్యాటింగ్‌‌ను ప్రారంభిస్తారని కోచ్ ద్రవిడ్ తెలిపాడు. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చివరిసారిగా 2022 టీ-20 ప్రపంచ కప్‌లో ఆడారు. ఆ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది. అప్పటి నుంచి ఈ దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ టీ-20లకు దూరమై వన్డేలు, టెస్టులకే పరిమితమయ్యారు.

ఆ ప్రచారంలో నిజం లేదు
ఇక శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. ప్రస్తుత టీ20 జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు లేదని, విరాట్ కోహ్లీ రాకతో అతని దారులు మూసుకుపోయాయని తెలిపాడు. ఇక మానసిక సమస్యలతో జట్టుకు దూరంగా ఉన్న ఇషన్ కిషన్.. ఈ సిరీస్‌కు కూడా అందుబాటులోకి రాలేదని, అందుకే అతన్ని ఎంపిక చేయలేదని రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు.