సుకన్య సమృద్థి యోజనదారులకు శుభవార్త.. పథకంపై వడ్డీ రేట్ల పెంపు

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్థి యోజన (ఎస్‌ఎస్‌వై) పొదుపు పథకం వినియోగదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. బాలికల భవిష్యత్తు అవసరాలను ఉద్దేశించిన పొదుపు పథకంపై కేంద్రం ఎట్టకేలకు స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచింది.

Courtesy: IDL

Share:

దిల్లీ: సుకన్య సమృద్థి యోజన (ఎస్‌ఎస్‌వై) పొదుపు పథకం వినియోగదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. బాలికల భవిష్యత్తు అవసరాలను ఉద్దేశించిన పొదుపు పథకంపై కేంద్రం ఎట్టకేలకు స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచింది. సుకన్య సమృద్ధి స్కీంపై వడ్డీరేటును 20 బేసిస్‌ పాయింట్లు పెంచిన కేంద్ర సర్కార్‌.. మూడేండ్ల కాలపరిమితి కలిగిన టర్మ్‌ డిపాజిట్‌ స్కీంపై వడ్డీని 10 బేసిస్‌ పాయింట్లు సవరించింది. ఈ పెరిగిన వడ్డీరేట్లు జనవరి-మార్చి త్రైమాసికానికి వర్తించనున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు ఈ పథకంలోని పొదుపు సొమ్ముపై 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంటే, దీన్ని 8.2 శాతానికి పెంచింది. అలాగే, మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌పై 0.10 శాతం వడ్డీ రేటును పెంచింది. దీంతో ఈ పథకంలో రేటు 7 శాతం నుంచి 7.1 శాతానికి చేరింది.

2024 జనవరి 1 నుంచి మార్చి 31 కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మిగిలిన అన్ని పథకాలకు సంబంధించి ప్రస్తుతమున్న రేట్లనే కొనసాగించింది. ప్రతి మూడు నెలలకొకసారి చిన్న మొత్తాలపై వడ్డీరేటును సవరిస్తున్న కేంద్రం.. ఈసారి మాత్రం రెండు పథకాలపై వడ్డీరేట్లను సవరించింది. మిగతా స్కీంలపై వడ్డీని యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ప్రజాదరణ పొందిన పీపీఎఫ్‌, పొదుపు డిపాజిట్లపై వడ్డీరేట్లు యథాతథంగా ఉన్నాయి. పీపీఎఫ్‌ రేటు 7.1 శాతంగాను, పొదుపు డిపాజిట్లపై వడ్డీరేటు 4 శాతం వద్ధ స్థిరంగా ఉన్నది. డిసెంబర్‌ త్రైమాసికంలోనూ ఇదే రేట్లు కొనసాగాయి. అలాగే 115 నెలల్లో మెచ్యూర్‌ అయ్యే కిసాన్‌ వికాస్‌ పత్రాలపై 7.5 శాతం వడ్డీరేటును, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌పై 7.7 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తున్నది. మంత్లీ ఇన్‌కం స్కీంపై 7.4 శాతం వడ్డీ ఇస్తున్నది.

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్(ఎన్‌ఎస్‌సీ) రేటు 7.7 శాతంలో ఎలాంటి మార్పు లేదు. పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ రేటు 7.4 శాతంగా కొనసాగనుంది. ప్రతి మూడు నెలలకోమారు చిన్న మొత్తాల పొదుపు పథకాలను సమీక్షించి, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటిస్తుంటుంది. ఆర్‌బీఐ కీలక రెపో రేటును ఏడాది కాలంలో 2.5% మేర పెంచి 6.5 శాతానికి చేర్చడం తెలిసిందే. కొన్ని విడతలుగా రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తోంది. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లలోనూ పెద్దగా మార్పులు ఉండడం లేదు.

వడ్డీ రేట్లు పెంచిన బీఓబీ
బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ బాటలోనే బీవోబీ కూడా డిపాజిట్లపై వడ్డీని 125 బేసిస్‌ పాయింట్ల వరకు సవరించింది. రూ.2 కోట్ల లోపు టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను 10 బేసిస్‌ పాయింట్ల నుంచి 125 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు బీవోబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 7 రోజుల నుంచి 14 రోజుల లోపు కాలపరిమితి కలిగిన టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 125 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో వడ్డీరేటు 3 శాతం నుంచి 4.25 శాతానికి చేరుకున్నది. అలాగే 15 రోజుల నుంచి 45 రోజుల్లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటు 100 బేసిస్‌ పాయింట్లు సవరించడంతో రేటు 4.50 శాతానికి చేరింది. స్వల్పకాలిక డిపాజిట్లు ముఖ్యంగా ఏడాది లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించినట్లు బ్యాంక్‌ వర్గాలు వెల్లడించాయి.