మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు.. ఎమోషనల్ అయిన మహేశ్ బాబు!

Tollywood superstar Mahesh Babu: గత 25 ఏళ్లుగా ఫ్యాన్స్ చూపించిన అభిమానం ఎన్నడూ మర్చిపోలేనని ప్రిన్స్ అన్నారు. మీ అభిమానం ప్రతీ ఏడాది అతి పెరుగుతూనే ఉందని, థ్యాంక్‌ యూ సో మచ్‌, మాటల్లేవ్‌.. ఏం చెప్పాలో నాకు తెలియదు.. ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా చేతులెత్తి దండం పెట్టడం తప్ప.. అని తెలిపారు.

Courtesy: x

Share:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో వేడుకగా జరిగింది.ఈ సినిమాలో మహేశ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించారు. జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తమ ఊరులో ఈ ఫంక్షన్ జరగడం ఆనందంగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చిత్ర యూనిట్ మొత్తం గుంటూరు తరలి రావడంతో కార్యక్రమం కళకళలాడింది. 

గత 25 ఏళ్లుగా ఫ్యాన్స్ చూపించిన అభిమానం ఎన్నడూ మర్చిపోలేనని ప్రిన్స్ అన్నారు. మీ అభిమానం ప్రతీ ఏడాది అతి పెరుగుతూనే ఉందని, థ్యాంక్‌ యూ సో మచ్‌, మాటల్లేవ్‌.. ఏం చెప్పాలో నాకు తెలియదు.. ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా చేతులెత్తి దండం పెట్టడం తప్ప.. అని తెలిపారు. అందరికీ చేతులెత్తి దండం పెడుతూ.. మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారన్నాడు. "త్రివిక్రమ్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. ఆయనతో సినిమా చేసినప్పుడల్లా.. నా పెర్ఫార్మెన్స్‌‌లో నాకు తెలియకుండానే  ఒక మ్యాజిక్ జరుగుద్ది. అతడు, ఖలేజా చిత్రాల్లో అలాగే జరిగింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’లో కూడా కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు. దీనికి త్రివిక్రమ్ గారే  కారణం. నిర్మాత చినబాబు గారికి మోస్ట్ ఫేవరేట్ హీరో నేనే కావడం హ్యాపీ. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా." అని తెలిపారు. 

"తెలుగమ్మాయి శ్రీలీలతో యాక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే... ఆమెతో డ్యాన్స్ చేయడం మరో ఎత్తు. గెస్ట్ రోల్ చేసిన మీనాక్షికి థ్యాంక్స్.  తమన్ ఇచ్చిన కుర్చీ మడతపెట్టి సాంగ్‌‌కి థియేటర్లు బద్దలైపోతాయి." అన్నారు. 

నాన్న లేకపోవడం ఏదోలా ఉంది
"సంక్రాంతి నాకు కానీ, నాన్నగారికి కానీ బాగా కలిసొచ్చిన పండగ. మా సినిమాకు సంక్రాంతికి విడుదలైతే అది బ్లాక్ బస్టరే. ఈ సారి కూడా గట్టిగా కొడతాం. కానీ ఈ సారిఎందుకో కాస్త కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్య లేరు.. అందువల్లేనేమో. ఆయన నా సినిమా చూసి.. నా రికార్డులు చూసి ఫోన్ చేసి చెబుతుంటే చాలా ఆనందమేసేది. ఆ ఫోన్ కాల్‌ కోసం ఎదురుచూస్తూ ఉండేవాడిని. దాని కోసమే కదా.. ఈ సినిమాలన్నీ. అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ.. మీరే నాకు నాన్న.. మీరే నాకు అన్నీ. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడూ నా దగ్గరే ఉండాలని కోరుకుంటున్నా.. ధన్యవాదాలు" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు మహేశ్‌ బాబు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఒక సినిమాకి వంద శాతం పని చేయాలంటే.. రెండొందల శాతం పనిచేసే హీరో మహేష్ బాబు. ఆయనతో  అతడు, ఖలేజా చిత్రాలు చేసినప్పుడు ఎలా ఉన్నారో..  ఇప్పుడు అలాగే ఉన్నారు. రమణ గాడిగా మహేష్ అందర్నీ అలరిస్తారు. ఈ సంక్రాంతిని చాలా గొప్పగా, ఆనందంగా జరుపుకుందాం’ అని అన్నారు. కార్యక్రమానికి దిల్ రాజు, నిర్మాత చినబాబు, నటుడు అజయ్ ఘోష్, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. 

గుంటూరు కారం చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తుండగా.. ఎస్‌ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం లోని కుర్చీ మడతపెట్టి సాంగ్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.