తమిళ నటుడు విజయకాంత్‌ ఇకలేరు.. శ్వాస సంబంధ సమస్యతో కన్నుమూత

Vijaykanth : ప్రముఖ కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌ (Vijayakanth) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో ఇటీవల చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చేరారు. కాగా, పరీక్షల్లో ఆయనకు కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు సమాచారం.

Courtesy: x

Share:

చెన్నై: ప్రముఖ కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌ (Vijayakanth) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో ఇటీవల చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చేరారు. కాగా, పరీక్షల్లో ఆయనకు కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్‌ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు. ‘కెప్టెన్‌’ మృతిపట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 

విజయకాంత్‌ గత ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్‌ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే, అప్పుడే ఆయన మరణించారనే వార్తలు నెట్టింట షికారు చేశాయి. ఆ వదంతులను ఆయన సతీమణి ప్రేమలత కొట్టిపారేశారు. డిశ్చార్జి అయి రెండు వారాలు కూడా గడువకముందే ఆయన కొవిడ్‌ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 

విజయ్ కాంత్ నేపథ్యం
విజయకాంత్‌ 1952 ఆగస్టు 25న మధురై (తమిళనాడు)లో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. ఆయన తల్లిదండ్రులు కె.ఎన్‌. అళగర్‌స్వామి, ఆండాళ్‌ అజగర్‌స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా మారారు. తమిళ సినీ పరిశ్రమలో విజయకాంత్‌ తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సైతం అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.  విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్‌ ‘సగప్తం’, ‘మధుర వీరన్‌’ చిత్రాల్లో నటించారు.

విజయ్ కాంత్ మరణం పట్ల ప్రముఖ నటి ఖుష్బూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ ఒక వజ్రం లాంటి వ్యక్తిని కోల్పోయిందని ఆమె తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటూ ట్వీట్ చేశారు. విజయ్ కాంత్ కుటుంబసభ్యులకు, అభిమానులకు భగవంతుడు మనోధైర్యాన్ని చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. 
 

తన కెరీర్‌లో విజయకాంత్‌ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ, ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్‌ అయి మంచి విజయాలు సాధించాయి. ‘శివప్పు మల్లి’ (ఎర్ర మల్లెలు రీమేక్‌), ‘జదిక్కొరు నీధి’ తదితర చైతన్యవంతమైన సినిమాల్లో నటించడంతో కోలీవుడ్‌లో ముందుగా ఆయన్ను ‘పురట్చి కలైంజ్ఞర్‌’ (విప్లవ కళాకారుడు) అనేవారు.